ఎప్పుడో ఆగష్టులో సెట్స్ మీదికి వెళ్లాల్సిన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. కానీ ఇతర కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా రేపట్నుంచి సెట్స్ మీదికి వెళ్లనుంది.
ఈ సినిమా అనుకున్నప్పటి నుండీ సినిమాపై అంచనాలు ఎంత భారీ స్థాయిలో ఉన్నాయో, మరో పక్క రూమర్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా నుండి మొదట అనుకున్న టెక్నీషియన్స్, నటీనటుల్లో కొంతమంది హ్యాండ్ ఇచ్చారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే 'సైరా' టీమ్ వాటన్నింటినీ ఖండిస్తూ వచ్చింది. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా నుండి కొందరు టెక్నీషియన్లు తప్పుకున్న మాట వాస్తవమేననిపిస్తోంది. సినిమాటోగ్రఫర్‌గా రవివర్మను అనుకున్నారు. కానీ ఆయన ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఆ ప్లేస్‌లో రత్నవేలు వచ్చి చేరినట్లు తాజా సమాచారమ్.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ క్లారిటీ లేదు. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాల్సి ఉంది. అయితే ఆ ప్లేస్ కూడా ప్రస్తుతం ఖాళీ అవనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్లేస్‌ని భర్తీ చేసే విషయంలో కీరవాణి, తమన్ ఇలా పలు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుందో చూడాలి. ఇదో హిస్టారికల్ మూవీ. సో ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సినిమాని ఓ స్థాయిలో నిలబెట్టేందుకు నేపథ్య సంగీతం బాగా తోడ్పడుతుంది. సో ఆచి తూచి అడుగులెయ్యాలి మ్యూజిక్ విషయంలో.
ప్రస్తుతం ఈ విభాగం చర్చల దశలో ఉంది. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నుండి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రేపట్నుంచి సెట్స్ మీదికి వెళ్లనున్న 'సైరా' రెగ్యులర్ షూటింగ్ షురూ చేయనుంది. చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.