'ఈ యుధ్దం' ఎవరికోసం.. మనకోసం'. టీజర్ చూపిస్తామని చెప్పి, 'సైరా' టీమ్ సినిమా చూపించేసింది. చిరంజీవి నుండి ఓ సగటు సినీ అభిమాని ఏం ఆశిస్తాడు? నిలువెత్తు కటౌట్ చాలు. సినిమా ఎలా ఉన్నా, అది వేరే సంగతి. చిరంజీవి సినిమా కోసం క్యూ లైన్‌లో బట్టలు చింపుకున్న ఓ అభిమాని తన అభిమాన హీరోని ఇంతకన్నా గొప్పగా ఎలా చూపించగలడు?
కోట బురుజు మీద జెండా కర్ర పట్టుకుని నిలుచున్న చిరంజీవి, కెమెరా అలా ప్యాన్ అవుతూ, చిరంజీవిని ఫ్రంట్ వ్యూలో చూపించడం.. ఇది చాలు. ఇంతకు మించి ఎవరైనా ఇంకేం చేయగలరు? అని అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. బోనస్‌గా చెట్ల మధ్య నుండి గుర్రంపై దూసుకొచ్చిన చిరంజీవి, గుర్రంపై కత్తి దూసిన చిరంజీవి, క్లైమాక్స్‌లో గుర్రాన్ని రెండు కాళ్ల మీద లేపి పవర్ చాటిన మెగాస్టార్.. అంతే అయిపోయింది కదా సినిమా.
ఇంకేం కావాలి. ఇంట్రెవల్ లేదు. టిక్కెట్ లేదు. అంతా ఒకటిన్నర నిమిషంలో చూపించేశాడు. చరణ్ ఈ సినిమా ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆలోచించడానికి అంత టైం ఎందుకు తీసుకున్నాడో టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఆయన ప్యాషన్ ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించింది.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, చరణ్ నిర్మాణ విలువలు ఒక్కటేమిటీ అన్నీ హాలీవుడ్ మేకింగ్‌ని తలపించాయి. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ టీజర్‌తోనే అద్భుతం అనిపించేసింది.