సైరా నర్సింహారెడ్డి
వేసవి... సినిమాలకు సంబంధించినంత వరకూ బంగారంలాంటి సీజన్. కాలేజీలు, స్కూళ్లకు సెలవలు ఇస్తారు. యువతరం అంతా ఖాళీగా ఉంటుంది. వాళ్లని థియేటర్లకు రప్పించడం చాలా సులభం. అందుకే.. పెద్ద సినిమాలన్నీ సమ్మర్ ని టార్గెట్ చేస్తుంటాయి. బాహుబలిలాంటి సినిమాలు వేసవిలో వచ్చి విజయఢంకా మోగించాయి. ఇప్పుడు 'సైరా' కూడా వేసవినే లక్ష్యంగా చేసుకుని రూపొందుతోంది. దాదాపు 200 కోట్లతో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. వేసవిలో విడుదల చేయడమే అన్ని విధాలా శ్రేయస్కరం. చిత్రబృందం కూడా '2019 వేసవిలో ఈ సినిమా రావాల్సిందే' అనే రేంజులో కష్టపడుతోంది. అయితే ఈ ఛాన్స్ `సైరా` మిస్ చేసుకుంది. దానికి గల కారణం.... నిర్మాణంలోని జాప్యమే.
ఈ సినిమా మొదలై... దాదాపుగా యేడాది కావొస్తోంది. అయితే ఇప్పటి వరకూ సగం సినిమా కూడా పూర్తి కాలేదు. పైగా ఇలాంటి చిత్రాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా కీలకం. వాటి కోసమే ఎక్కువ సమయం తీసుకోవాల్సివుంటుంది. ఆదరాబాదరగా సినిమాని విడుదల చేయడం కుదరదు. అందుకే.. కాస్త ఆలస్యమైనా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని చిత్రబృందం నిర్ణయించుకుంది. దాంతో.. వేసవి టార్గెట్‌ని పక్కన పెట్టేయాల్సివస్తోంది. వేసవికి రాకపోతే... దసరా వరకూ ఈ సినిమాకి స్లాట్ దొరకదు. ఒకవేళ ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటే.. అక్కడ 'సాహో' కాచుకుని కుర్చున్నాడు. అది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. పడితే `సాహో`తో పోటీ పడాలి.. లేదంటే సోలోగా దసరాకి రావాలి. ప్రస్తుతం సైరా ముందున్న మార్గాలు ఇవే.