తానెప్పుడూ ఏ సినీ పరిశ్రమనీ నిందించలేదని సొట్టబుగ్గల సుందరి తాప్సీ చెబుతోంది. ‘రష్మి రాకెట్’ సహా పలు విభిన్న చిత్రాలతో బిజీగా వున్న తాప్సీ, గతంలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవడం పట్ల తాజాగా స్పందించింది. ఆయా సందర్భాల్ని బట్టి, తనకు ఎదురయ్యే ప్రశ్నలను బట్టి తన సమాధానాలు వుంటాయనీ, ఆ ప్రశ్నకు ఆ సమాధానం సరైనదా.? కాదా.? అన్నదే చర్చ తప్ప, అందులో ఏ సినీ పరిశ్రమనూ ప్రత్యేకంగా విమర్శించాలనే ఆలోచన తనకు వుండదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తాప్సీ చెప్పుకొచ్చింది.
ఇకపై తాను బికినీలో కనిపించనంటూ చేసిన ప్రకటనలోని ఆంతర్యాన్ని తెలుసుకోవాలంటున్న తాప్సీ, సన్నివేశాల్లో బలం లేకుండా అందాల ప్రదర్శన చేస్తే అందులో అర్థమే వుండదని చెప్పింది.
బికినీ ధరించడాన్ని తప్పు పట్టలేననీ, ఎందుకంటే తానూ గతంలో ఆ పని చేశాననీ, ఎక్స్‌పోజింగ్ అనేది ఆయా సన్నివేశాల్ని బట్టి జరిగింది తప్ప, దర్శకులు తనతో బలవంతంగా ఆ పని చేయించారని తానెప్పుడూ చెప్పలేదనీ, చెప్పలేననీ, తాను ఒప్పుకున్న తర్వాతనే ఆ సన్నివేశాల చిత్రీకరణ జరిగిందనీ తాప్సీ అంటోంది. తాప్సీలో ఈ కొత్త కోణం కాస్తంత ఆశ్చర్యం కలిగించకమానదు. ఏంటో, తాప్సీ ఏం చెప్పినా అది సంచలనమే అవుతుంటుంది.