అతి త్వరలో 2020కి స్వాగతం పలకబోతున్నాం. ఈలోగా 2019లోనే జాతకాలు చూసేసుకుందాం అనుకున్న కొన్ని చిన్న సినిమాలు - విడుదలకు వరుస కట్టాయి. డిసెంబరు 20న పెద్ద సినిమాల తాకిడి ఎక్కువ ఉండడం, డిసెంబరు 13నే వెంకీ మామ రావడంతో ఈవారమే కొన్ని సినిమాలు అర్జెంటుగా విడుదల కావాల్సివచ్చాయి. దాంతో డిసెంబరు 6న బాక్సాఫీసు మహా హడావుడిగా కనిపించింది. దాదారు అరడజను చిత్రాలు హంగామా చేశాయి.
కార్తికేయ సినిమా `90 ఎం.ఎల్` డిసెంబరు 5నే రావాల్సింది. సెన్సార్ కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా డిసెంబరు 6న విడుదలైంది. ఓ ఆర్థరైజ్డ్ ఆల్కాహాలిక్ కథ ఇది. పాయింట్ బాగానే ఉంది.కాకపోతే దాన్ని ప్రజెంట్ చేసిన విధానమే సరిగా లేదు. రొటీన్ సన్నివేశాలు, అలవాటైన ఫార్ములాతో బాగా బోర్ కొట్టించేశాడు. దాంతో 90 ఎం.ఎల్ కిక్ ఇవ్వలేకపోయింది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నా,పాటలు బాగున్నా.. కథనం తేడా చేయడంతో ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. దాదాపు 13 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీశారు. బిజినెస్ బాగానే జరిగింది. కానీ.. ఫలితం లేకుండాపోయింది.
శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం `భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు`. కామెడీ గ్యాంగ్ మొత్తాన్ని ఈసినిమాలోకి తీసుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి. కానీ కామెడీ మాత్రం లేదు. టైటిల్‌కి తగ్గట్టు ఈ సినిమా మొత్తాన్ని హైదరాబాద్ రోడ్దపై చుట్టేశారు. క్వాలిటీ అంతంత మాత్రమే. కామెడీ ట్రాకులున్నా - అందులో కామెడీ లేకపోవడం ఈసినిమాకి శాపంగా మారింది. చాలా సన్నివేశాలు పేలవంగా తయారయ్యాయి. దాదాపు 2 కోట్లతో తెరకెక్కిన సినిమా ఇది. పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదు.
ఉదయ్ శంకర్ సినిమా `మిస్ మ్యాచ్` విడుదలకు ముందు బాగానే హడావుడి చేసింది. భారీ ఎత్తున పబ్లిసిటీ చేశారు. తొలి ప్రేమలోని పాటని రీమిక్స్ చేయడంతో - ఇంకాస్త క్రేజ్ వచ్చింది. అయితే దేన్నీ నిలబెట్టుకోలేక బాక్సాఫీసు దగ్గర మిస్ ఫైర్‌గా మారిందీ సినిమా. పవన్ పాటనీ చెడగొట్టిన అపప్రదని మూటగట్టుకుంది. ప్రధాన పాత్రలన్నీ తేలిపోవడం, బోరింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని విసిగించారు. దానికి తగ్గట్టు థియేటర్లో జనాలు కూడా కరువయ్యారు. ఈసినిమాలతో పాటు `కలియుగ` అనే మరో చిన్న సినిమా కూడా విడుదలైంది. దాని గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడమే లేదు. ఇలా ఈ వారం ఇన్ని సినిమాలొచ్చినా ఏదీ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోలేకపోయింది.