ఎన్నో ఆశలతో 2020లోకి అడగుపెట్టింది టాలీవుడ్. 2019 ఇచ్చిన చేదు జ్ఞాపకాల్ని మర్చిపోతూ, గత యేడాది ఇచ్చిన విజయాలనే స్ఫూర్తిగా తీసుకొని కొత్త ప్రయాణం ప్రారంభించింది. జనవరి 1న, 3వ తేదీన కొత్త సినిమాలు వరుస కట్టాయి. అయితే అన్నీ చిన్న సినిమాలే. ఈ రెండు రోజుల్లోనూ దాదాపుగా అరడజను సినిమాలు విడుదలయ్యాయి. అయితే.. వాటిలో బాక్సాఫీసునీ, ప్రేక్షకుల్నీ, విమర్శకుల్నీ మెప్పించిన సినిమా ఒక్కటీ లేదు. ఓ రకంగా.. 2020లో ఇది ఆశించని ప్రారంభం.
జనవరి 1న నాలుగు సినిమాలొచ్చాయి. అందులో రెండు డబ్బింగులు. అతడే శ్రీమన్నారాయణ, తూటా అనువాద చిత్రాలు. ఉల్లాల ఉల్లాల, బ్యూటీఫుల్ సినిమాలు నేరుగా విడుదలైన తెలుగు సినిమాలు. 3వ తేదీన కూడా కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో హల్ చల్, ఉత్తర సినిమాలు ఉన్నాయి. అయితే ఈ 5 సినిమాలూ ఏమాత్రం ఆకట్టుకోలేదు. వీటికి కనీసం ప్రారంభ వసూళ్లు కూడా దక్కలేదు. కన్నడలో ఓపెనింగ్స్ దక్కించుకున్న అతడే శ్రీమన్నారాయణ తెలుగులో మాత్రం మెప్పించలేదు. వర్మ నానా హడావుడి చేసి వదిలిన బ్యూటీఫుల్ వైపుగా ప్రేక్షకులు ఏమాత్రం చూడలేదు. ఉల్లాల ఉల్లాల, ఉత్తర, హల్ చల్ సంగతులు సరే సరి. మొత్తానికి తొలి వారం డిజాస్టర్ అనే చెప్పుకోవాలి.
ప్రేక్షకుల దృష్టంతా సంక్రాంతి సీజన్‌పై ఉంది. దానికి ముందు విడుదల చేసే ఏ సినిమాకైనా ఇలాంటి ఇబ్బందులు తప్పవు. జనవరి 9 నుంచి సంక్రాంతి హంగామా మొదలైపోతుంది. ఈ సీజన్‌లో ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఢీ కొట్టుకుంటున్నాయి. వీటిలో ఏ సినిమా హిట్ల బోణీ కొడుతుందో చూడాలి.