వేసవి సీజన్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈలోగా చిన్న, మధ్యస్థాయి చిత్రాలు వరుస కడుతున్నాయి. వారానికి రెండు మూడు సినిమాలు గ్యారెంటీగా థియేటర్లలో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే సంక్రాంతి తరవాత టాలీవుడ్‌లో సరైన సినిమా పడలేదు. వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీసు దగ్గర పల్టీ కొడుతోంది. మరి ఈ వారం టాలీవుడ్ జాతకం ఎలా వుంది? ఈ వారం ఏ సినిమా మ్యాజిక్ చేసింది..?
ఎప్పట్లా ఈ వారం కూడా సినిమాలు హోరెత్తాయి. భీష్మతో పాటు ప్రెజర్ కుక్కర్, వలయం వచ్చాయి. ముందు గా భీష్మ గురించి మాట్లాడుకోవాలి. నితిన్ - రష్మిక జంటగా నటించిన చిత్రమిది. ఛలోతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. నితిన్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే 6.5 కోట్లు తెచ్చుకున్న ఈ సినిమా. నితిన్ గత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. శని వారం కూడా ఇదే జోరు కొనసాగింది. ఆదివారం కూడా హోస్ ఫుల్స్ అవ్వడం ఖాయం. మొత్తానికి నితిన్‌కి వరుస పరాజయాల తరవాత... ఓ మంచి విజయం దక్కినట్టే. కామెడీ బాగా వర్కవుట్ అవ్వడం, నితిన్ - రష్మిక మధ్య కెమిస్ట్రీ పండడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది.
ఇక ఈ వారం మంచి అంచనాలతో విడుదలైన సినిమా `ప్రెజర్ కుక్కర్`. సాయి రోనక్ హీరోగా నటించాడు. అమెరికా మోజులో పడిన యువత ఇబ్బందులు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ పబ్లిసిటీ గట్టిగా చేశారు. అయితే ఫలితం లేకుండా పోయింది. కథ బాగున్నా, కథనం చప్పగా సాగడంతో ఈ సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు. శుక్రవారం, శనివారం బీసీ సెంటర్లలో కొన్ని చోట్ల కలక్షన్లు బాగున్నాయి. అయితే అవి రికవరికి ఏమాత్రం సరిపోవు. ఇక ఈ సినిమాతో విడుదలైన `వలయం` పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ సినిమాని పట్టించుకున్నవాళ్లే లేరు.