వరుస విజయాలతో విజయ్ దేవరకొండ స్టార్ హోదా సంపాదించేసుకున్నాడు. విజయ్ సినిమా వస్తోందంటే.. ఆశలు, అంచనాలూ ఎక్కువైపోతున్నాయి. మిగిలిన సినిమాలు విడుదల చేయడానికి కూడా జంకుతున్నారు. దానికి తగ్గట్టే... విజయ్ కొత్త సినిమా 'డియర్ కామ్రేడ్'కి సోలో రిలీజ్ దక్కింది. గీత గోవిందం తరవాత విజయ్ - రష్మిలు జోడీ కట్టిన సినిమా ఇది. ఆ మ్యాజిక్ కలిసొచ్చి - విజయ్ దేవరకొండ హిట్ పరంపర ఈ సినిమాతోనూ కొనసాగుతుందని అభిమానులు ఆశించారు. మరి ఈ సినిమా రిలజ్ట్ ఏమిటి? బాక్సాఫీసు వసూళ్లు ఎలా ఉన్నాయి? విశ్లేషకులు ఏమంటున్నారు..? శుక్రవారం బాక్సాఫీసు ముందుకు వచ్చింది డియర్ కామ్రేడ్.
తొలి రోజు వసూళ్లు దుమ్ము దులిపాయి. దాదాపుగా 11 కోట్లు సాధించింది. విజయ్ సినిమాల్లో ఇదే రికార్డు. ఓవర్సీస్‌లోనూ మంచి ఓపెనింగ్స్ అందుకుంది. తొలి రెండు రోజుల్లో దాదాపుగా 18 కోట్లు సాధించింది. అయితే... రివ్యూలన్నీ `యావరేజ్` దగ్గరే ఆపేశాయి. సినిమా స్లోగా ఉందని, కథ, కథనాల్లో కొత్తదనం లేదని తేల్చేశారు. విజయ్, రష్మికల క్రేజ్, వాళ్ల మధ్య కెమిస్ట్రీ ఒక్కటే ఈ సినిమాని నిలబెట్టగలిగాయి. మాస్‌కి కావల్సిన అంశాలు, యూత్ మళ్లీ మళ్లీ చూడగలిగే విషయాలూ ఈసినిమాలో లేకపోవడం పెద్ద లోటే. నిడివి విషయంలో దర్శక నిర్మాతలు అజాగ్రత్తగా ఉండడం మైనస్ పాయింట్. మొత్తానికి విజయ్ సినిమాకి డివైడ్‌టాక్ వచ్చింది. అయితే అడ్వాన్సు బుకింగులు జోరుగా ఉండడంతో ఓపెనింగ్స్‌కి ఢోకా లేకుండా పోయింది.
విజయ్ గత చిత్రాల క్రేజ్ ఈ సినిమాకి కలసి రావడంతో బాక్సాఫీసు దగ్గర నిలదొక్కుకునే వీలుంది. డియర్ కామ్రేడ్ డివైట్ టాక్ వల్ల... 'ఇస్మార్ట్ శంకర్'కి మళ్లీ పుంజుకునే అవకాశం దక్కింది. బీ,సీలలో రామ్ సినిమాకి మళ్లీ వసూళ్లు పెరిగాయి. వచ్చేవారం రెండు సినిమాలు 'రాక్షసుడు', 'గుణ 369' ఒకేసారి విడుదల అవుతున్నాయి. వచ్చేవారం కూడా థియేటర్లు కళకళలాడడం ఖాయం.