ఏ సినిమా హిట్‌నైనా బేరీజు వేసేవి మౌత్ టాక్, వసూళ్లు మాత్రమే. విమర్శకులు ఏమన్నా, ఏం రాసినా - ఇవి రెండూ బాగుంటే చాలు. సినిమా హిట్టయిపోయినట్టే. ఈ వారం కూడా మూడు సినిమాలొచ్చాయి. ప్రేక్షకుల తీర్పు కోరుతూ బాక్సాఫీసు దగ్గర నిలబడ్డాయి. మరి వాటికి ప్రేక్షకుల స్పందన ఎలా వచ్చింది? టాక్ ఆఫ్ ది వీక్‌గా నిలిచిన సినిమా ఏది?? తెలంగాణ సంస్క్కృతి సంప్రదాయాల నేపథ్యాన్ని మేళవిస్తూ, 1980ల నాటి వాతావరణాన్ని తెరపై ప్రతిబింబిస్తూ సాగిన చిత్రం 'దొరసాని'.
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, జీవిత కుమార్తె శివాత్మిక తొలిసారి నటించిన చిత్రమిది. దాంతో... ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడం, పాటలకు మంచి స్పందన రావడం, ఈమధ్య తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు మంచి విజయాల్ని అందుకోవడంతో - దొరసానిపై ఆశలు కలిగాయి. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీసు దగ్గర మిశ్రమ స్పందన లభించింది. 'సైరత్'ని తెలుగులో తీసినట్టుందని విమర్శకులు పెదవి విరిచారు. ఆనంద్, శివాత్మికలకు అరకొర మార్కులే పడ్డాయి.
కథ రొటీన్‌గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయితే, తెలంగాణ నేపథ్యాన్ని సమర్థంగా వాడుకోవడం ప్లస్. తొలి రోజు వసూళ్లు బాగా డల్‌గా కనిపించాయి. రెండోరోజు కాస్త తేరుకున్నా... ఆశించిన ఫలితం కనిపించడం లేదు. చావో రేవో తేల్చుకోవాల్సిన తరుణంలో సందీప్ కిషన్ నుంచి వచ్చిన సినిమా 'నిను వీడని నీడను నేనే'. ఈ సినిమాకి సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాతో హిట్టు కొట్టి తీరాతాను.. అని సందీప్ ముందు నుంచీ చాలా నమ్మకంగా చెబుతుండేసరికి - తప్పకుండా ఇందులో విషయం ఉందనే ఆశించాడు సగటు ప్రేక్షకుడు. కథ విషయంలో దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచించినప్పటికీ, దాన్ని తెరపై తీసుకురావడంలో మాత్రం తడబడ్డారు. హారర్, థ్రిల్లర్, ఫాంటసీ.. ఇలా లెక్కకు మించిన అంశాల్ని ఒకే కథలో ఇమడ్చడానికి చేసిన ప్రయత్నం బెడసి కొట్టింది.
అయితే మరీ అంత తీసి పారేయాల్సిన సినిమా కాకపోవడంతో - `యావరేజ్` స్థాయిలో ఆగిపోయింది. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే.. ఈ చిత్రానికే కాస్త వసూళ్లు బాగా కనిపిస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాకి బిజినెస్ జరగడం సానుకూలాంశం. ఇక ఈ వారమే విడుదలైన మరో సినిమా `రాజ్‌దూత్` పరిస్థితి దారుణంగా ఉంది. శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. సరైన పబ్లిసిటీ లేకపోవడం, గుంపుగా వచ్చిన సినిమాల మధ్యలో కళాహీనంగా కనిపించడం ఈ సినిమాకి మైనస్. ఈ చిత్రాన్ని అటు ప్రేక్షకులూ, ఇటు సినీ విశ్లేషకులు సైతం పట్టించుకోలేదు. దాంతో పాటు సినిమాలోనూ మేటర్ లేదని తేలిపోయింది.
గత వారం విడుదలైన ఓ బేబీకి ఉన్న వసూళ్లలో సగం కూడా... రాజ్‌దూత్‌కు లేకపోవడం శోచనీయం. టీజర్‌తో కాస్త హైప్ తెచ్చుకున్న రాజ్ దూత్.. దాన్ని విడుదలకు ముందు పాడు చేసుకుంది. మొత్తానికి శ్రీహరి తనయుడి ఎంట్రీ చాలా చప్పగా సాగిపోయింది. ఇక వచ్చేవారం 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తోంది. టాలీవుడ్‌లోకి పక్కా మాస్, మసాలా సినిమా వచ్చి చాలా రోజులైంది. పైగా పూరి డైలాగులు, రామ్ హైపర్ నటన.. కలగలిస్తే ఇక తిరుగుండదు. ఈ కాంబినేషన్ కాస్త నచ్చేసినా - బాక్సాఫీసు దగ్గర వసూళ్ల మోత మోయడం ఖాయం.