డిసెంబరు నుంచి పెద్ద సినిమాల హడావుడి మొదలైపోతుంది. ఆ హంగామా సంక్రాంతి వరకూ ఉంటుంది. అందుకే... ఈలోగా వీలైనన్ని చిన్న సినిమాలు దించేయాలని చిత్రసీమ భావిస్తోంది. అందుకే ప్రతీవారం రెండు మూడు చిత్రాలు వరుస కడుతున్నాయి. ఈసారి కూడా అరడజనుపైనే సినిమాలొచ్చాయి. అయితే వాటిలో అటు ప్రచారంతోనూ, ఇటు కంటెంట్‌తోనూ ఆకట్టుకున్నవి నాలుగే.
జార్జ్‌రెడ్డికి బీభత్సమైన హైప్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన ఓ విద్యార్థి నాయకుడి జీవిత కథ ఇది. కేవలం పాతికేళ్ల వయసులోనే హత్యకు గురయ్యాడు. అలాంటి కథ తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? అందుకే జార్జ్‌రెడ్డిపై ఫోకస్ పడింది. టీజర్లు, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో... సినిమా చూడాలన్న ఉత్సుకత ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే అయ్యింది. అయితే.. జార్జ్‌రెడ్డి కథలో ఉన్న ఫైర్... ఈ సినిమాలో కనిపించలేదు. టేకింగూ, మేకింగూ బ్రహ్మాండంగా కుదిరాయి. కానీ ఎమోషన్ మిస్ అయ్యింది. అయితే ఈ సినిమాకి వచ్చిన హైప్ వల్ల వసూళ్లు బాగానే ఉన్నాయి. నిర్మాతలైతే సేఫ్ జోన్‌లో పడిపోయారు. యావరేజ్‌కీ, ఎబౌ యావరేజ్‌కీ మధ్య ఊగిసలాడుతోంది.
కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి తన కెరీర్‌లో తొలిసారి ఓ థ్రిల్లర్ జోనర్ ఎంచుకున్నాడు. అదే.. `రాగల 24 గంటల్లో`. కాస్త థ్రిల్, కావల్సినన్ని మలుపులతో స్క్రిప్టు బాగానే రాసుకున్నాడు. ఈమధ్య వచ్చిన `ఎవరు` లక్షణాలు ఈ కథలో కనిపించాయి. కానీ.. థ్రిల్ మాత్రం ఆస్థాయిలో లేదు. తీసి పారేయాల్సిన సినిమా కాదు. ఒకసారి చూడొచ్చు. ఈవారం విడుదలైన సినిమాల్లో జార్జ్‌రెడ్డి తరవాత మంచి వసూళ్లని అందుకుంటున్న సినిమా ఇదే. దాదాపు 7 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి కేటాయించారు. అదంతా రావడం కాస్త కష్టమే అనిపిస్తోంది.
ఇక రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర వహించిన `తోలుబొమ్మలాట` కూడా ఈవారమే విడుదలైంది. `ఆ నలుగురు` ఛాయల్లో ఈ సినిమా ఉండడం, సెంటిమెంట్ డోస్ ఎక్కువవ్వడం, రొటీన్ స్క్రీన్ ప్లే ఈ సినిమాని బాగా విగించాయి. ప్రమోషన్లు కూడా సరిగా చేసుకోలేకపోయారు. దాంతో ఈ సినిమా వచ్చిందన్న సంగతీ ఎవరికీ తెలీదు.
చేతన్ మద్దినేని కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం `బీచ్ రోడ్ చేతన్` ఈ సినిమా వార్తల్లోకి నిలవడానికి ఓ కారణం ఉంది. విడుదలైన తొలి రోజు, తొలి ఆట ఉచితంగా ప్రదర్శించారు. టికెట్ కొనకుండానే సినిమా చూసే అవకాశం కల్పించారు. దాంతో.. తొలి రోజు తొలి ఆటకు బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ అది అంత వరకే. ఆ తరవాత జనం లేరు. నిజానికి ఇదో మంచి ప్రయత్నం. సినిమా బాగుంటే టాక్ స్పైడ్ అయి వసూళ్లు పెరిగేవి. సినిమాలో విషయం లేకపోవడంతో మాట్నీ నుంచి ఎవరూ పట్టించుకోలేదు.