ఎన్నికల వేడి, ఐపీఎల్ వీటి మధ్య సినిమాల్ని రిలీజ్ చేయడానికే నిర్మాతలు భయపడిపోతున్నారు. దానికి తోడు... వచ్చిన సినిమాల్లో విషయం లేక, వసూళ్లు రాక... అవి బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోతున్నాయి. ఈ వారం కూడా రెండు సినిమాలు వచ్చాయి. మరి అవి ఎలా వున్నాయి ? వాటిలో ఒక్కటైనా ప్రేక్షకుల మన్ననలు పొందగలిగిందా?
ఈ వారం విడుదల అయిన సినిమాల్లో మజిలీ ఒకటి. హిట్ పెయిర్ గా పేరొందిన నాగ చైతన్య, సమంత పెళ్లయ్యాక నటించిన తొలి సినిమా ఇది. నిన్ను కోరి తో దర్శకుడిగా నిరూపించుకున్న శివ నిర్వాణ చేసిన రెండో ప్రయత్నం. అందుకే ఈ సినిమా పై విడుదలకు ముందునుంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకుంటూ.. ఓ ఫీల్ గుడ్ ఫామిలీ డ్రామా గా నిలిచిపోయింది.
నాగ చైతన్య, సమంత కెరియర్ లో అతున్నత నటన ఈ చిత్రం లోనే ప్రదర్శించారని విమర్శకులు కూడా కితాబులు అందిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం, సహజ సిద్ధమైన సంభాషణలు, మధ్యతరగతి జీవితాల్లో కనిపించే డ్రామా ఇవన్నీ ఈ సినిమా కు ప్లస్ అయ్యాయి. తొలి రెండురోజుల వసూళ్లు చూస్తే.. బాక్స్ ఆఫీస్ పరంగానూ ఈ సినిమా హిట్ ఐపోయినట్టే.
ఇక ప్రేమకధా చిత్రం కి సీక్వెల్ గా వచ్చిన ప్రేమకధా చిత్రమ్ 2 ... డిజాస్టర్ ఖాతాలో చేరిపోయింది. తొలి భాగానికి, దీనికీ కధలో, కధనంలో, భయ పెట్టడం లో ఎలాంటి సంబంధం లేకపోవడం, నటీనటుల ఓవర్ యాక్షన్ ఈ సినిమాకి ప్రధాన లోపాలు. అటు భయం, ఇటు వినోదం రెండూ పండక.. ఈ ప్రేమ కథ పరమ బోరింగ్ గా అనిపించింది. సుమంత్ అశ్విన్ కెరియర్ లో మరో చెత్త సినిమా గా మిగిలిపోయింది. దానికి తోడు థియేటర్ లు కూడా జనాలు లేక... బోసిపోతున్నాయి.