నటీనటులు: నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, అతుల్ కులకర్ణి, సుబ్బరాజు తదితరులు.
దర్శకత్వం: శివ నిర్వాణ.
నిర్మాణం: సాహు గారపాటి, హరీష్ పెద్ది.
సంగీతం: గోపీ సుందర్, థమన్.
విడుదల తేదీ: 05 ఏప్రిల్ 2019.
రేటింగ్: 3/ 5
ప్రేమ, స్నేహం... వీటి గురించి ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదు. ఎంత చెప్పినా మరో కొత్త కోణం కనిపిస్తుంటుంది. పాత కథే ఫ్రెష్ గా చెప్పే ఛాన్సూ దొరుకుతుంటుంది. ప్రేమ విఫలమై.. విరహవేదన చెప్పాల్సినప్పుడైతే యూత్‌కి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయిపోవొచ్చు. అందుకే లవ్ స్టోరీలు ఎవర్ గ్రీన్‌గా సాగుతుంటాయి. 'నిన్ను కోరి' కోసం శివ నిర్వాణ ఎంచుకున్న తొలి కథ కూడా ప్రేమ కథే. ఈసారి 'మజిలీ'కీ అదే ప్రయత్నం చేశాడు. కాకపోతు.. పెళ్లికి ముందు ప్రేమ, పెళ్లయ్యాక ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రేమకథ ఎలా ఉంది? యువతరానికి నచ్చేలా తీయగలిగాడా, లేదా? నాగచైతన్య సమంతల నటన ఎలా ఉంది?
* కథ
పూర్ణ (నాగచైతన్య) క్రికెటర్ కావాలని కలలు కంటుంటాడు. చిన్నప్పుడే ఆర్మీ ఆఫీసర్ కూతురైన అన్షు (దివ్యాంశ కౌశిక్)తో స్నేహం మొదలవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అయితే ఈ ప్రేమకథ పెళ్లి వరకూ వెళ్లదు. అన్షుతో బంధం మధ్యలోనే తెగిపోతుంది. దాంతో పూర్ణ కలలన్నీ కరిగిపోతాయి. ఇష్టం లేకపోయినా శ్రావణి( సమంత)ని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. మనసులో మాత్రం అన్షు అలానే ఉండిపోతుంది. శ్రావణి పూర్ణని మార్చగలిగిందా? పూర్ణ తన మనసులో శ్రావణికి స్థానం ఇవ్వగలిగాడా? వీరిద్దరి బంధం ఎలా సాగింది? అనేది తెరపైనే చూడాలి.
* నటీనటులు
తెరపై నాగచైతన్య, సమంత కనిపించరు. కేవలం పూర్ణ, శ్రావణి పాత్రలు తప్ప. వాటిని అంత చక్కగా రాసుకున్నాడు దర్శకుడు. చైలో ఉత్తమ నటుడ్ని ఈ సినిమాలో చూడొచ్చు. అన్షుతో ప్రేమలో ఉన్నప్పుడు ఎంత అల్లరిగా ఉంటాడో, పెళ్లయ్యాక అంత మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంటాడు. రెండు గెటప్పులూ బాగా సూటయ్యాయి. చై కి సవాల్ విసిరే పాత్రలో సమంత కనిపించింది. ఇద్దరూ పోటీ పోటీగా నటించారు. శ్రావణిగా సమంత నటన కొంతకాలం గుర్తిండిపోతుంది. అన్షు గా దివ్యాంశ ఏం తక్కువ చేయలేదు. తను చాలా అందంగా, సహజంగా నటించింది. రావు రమేష్, పోసాని తమ వంతు సహాయం చేశారు. ఈ అయిదు పాత్రలే ఈ కథకు బలం.
* సాంకేతిక వర్గం
పాటలు బయట వినడం కంటే, థియేటర్లో చూసినప్పుడు బాగున్నాయి. 'వన్ గాళ్.. వన్ బాయ్ లుకింగూ' మాస్‌కి నచ్చుతాయి. మిగిలినవి సందర్భానుసారం ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం మరింత బలాన్నిచ్చింది. ఆర్ట్, కెమెరా, ఎడిటింగ్ ఇవన్నీ చక్కగా పనిచేశాయి. ఎమోషన్ సన్నివేశాల్లో డైలాగులు బాగా పండాయి. ఇలాంటి ప్రేమకథల్లో గ్యాంగ్ వార్‌లూ, యాక్షన్ సీక్వెన్స్‌లూ అనవసరం అనిపిస్తుంది. అవే.. కథని పక్కదోవ పట్టించాయేమో. సెకండాఫ్‌లో మితిమీరిన డ్రామాని మినహాయిస్తే... దర్శకుడు ఈ కథని సంతృప్తిగానే నడిపించాడు.
* విశ్లేషణ
ఇదో ఎమోషనల్ డ్రామా. ప్రేమ, స్నేహం, భార్యాభర్తల బంధం... ఇవన్నీ చక్కగా కలగలిపిన సినిమా. 'మజిలీ'లో నాగచైతన్య, సమంతలు కలసి నటిస్తున్నారనగానే తప్పకుండా వాళ్లిద్దరిపైనే ఫోకస్ ఉంటుంది. వారిద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుందనుకుంటారు. కానీ అన్షు (దివ్యాంశ) పాత్రతోనూ పూర్ణ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. తొలి సగాన్ని వీరిద్దరి ప్రేమకథ నడిపించేస్తుంది. మధ్యలో గ్యాంగ్ వార్‌ల వల్ల... యాక్షన్ ఎపిసోడ్లకి ఛాన్స్ దొరికింది. చై - దివ్యాంశ ఇద్దరి మధ్య సీన్లను చాలా కొత్తగా రాసుకోగలిగాడు శివ నిర్వాణ.
మధ్యతరగతి జీవితాల్ని, వాళ్ల స్నేహాల్నీ, ఇష్టాల్ని బాగా క్యాప్చర్ చేశాడు. కథతో పాటే వినోదమూ సాగిపోతుంటుంది. కాబట్టి... తొలి సగంలో ఎలాంటి బ్రేకులూ ఉండవు. ఓ ఫీల్ గుడ్ సినిమా చూస్తున్నామన్న భావన కలుగుతుంది. ద్వితీయార్థంలో శ్రావణి పాత్ర ఎంటరై... సినిమా మొత్తాన్ని తన వైపుకు తిప్పేసుకుంటుంది. భర్త మనసులో స్థానం కోసం ఓ భార్య ఎంతగా తపిస్తుందో చెప్పడానికి శ్రావణి పాత్ర ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఈమధ్య కాలంలో కథానాయిక పాత్రని ఇంత బలంగా రాసుకోవడం ఇదే తొలిసారేమో అనిపిస్తుంది. పూర్ణ - శ్రావణిల మధ్య కెమిస్ట్రీ కంటే.. వాళ్లిద్దరి మధ్య ఉండే ఎమోషన్‌కి ఎక్కువ మార్కులు పడతాయి.
అయితే మజిలీ సినిమాలో తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్థంలో సెంటిమెంట్ డోసు ఎక్కువగా కనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఆ సన్నివేశాలన్నీ కనెక్ట్ అవ్వడం సులభమే. కానీ యువతరం ఎంత వరకూ ఓపిగ్గా చూస్తారన్నది ప్రశ్న. క్లైమాక్స్‌లో ఈ సినిమాని ఎలా ముగించాలో తెలీక దర్శకుడు కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యాడు. లాజిక్ లేని సీన్లతో కాస్త విసిగిస్తాడు కూడా. ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడి ఉంటే.. తప్పకుండా ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇదో క్లాసిక్ అయిపోయేది. ఇంత మంచి సినిమాని ఇలా ముగించాడేంటి? అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు.
* ప్లస్ పాయింట్స్
+ చై - సమంత
+ ఎమోషన్ సీన్స్
+ పాటలు
* మైనస్ పాయింట్స్
- సెకండాఫ్ లో డ్రామా
- లాజిక్ లేని ప్రీ క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: చై - శామ్ షో.
- రివ్యూ రాసింది శ్రీ.