వేసవి సమరంచ ముంచుకొస్తోంది. పెద్ద సినిమాలు బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాయి. ఈలోగా చిన్న సినిమాలు విడుదల చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. మార్చి - ఏప్రిల్ మధ్యలో చిత్రసీమ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కుంటుంది. ఎందుకంటే ఇది పరీక్షల సీజన్. అయినా సరే.. విరివిగా సినిమాలు విడుదల చేస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ వారం కూడా నాలుగు సినిమాలు వరుస కట్టాయి. పలాస, ఓ పిట్ట కథ, అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ, కాలేజ్ కుమార్ విడుదలయ్యాయి. అర్జున కూడా రావాల్సిందే. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
నాలుగు సినిమాలు విడుదలైనా - విమర్శకుల ప్రశంసలు మాత్రం ఒక్క సినిమాకే దక్కాయి. అదే పలాస. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించిన చిత్రమిది. 1970 నేపథ్యంలో పలాస అనే గ్రామంలో నడిచే కథ. అప్పటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టింది. అత్యంత సహజమైన వాతావరణంలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. నటీనటుల ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఈ కథని మరింత రక్తి కట్టించాయి. ఈమధ్యకాలంలో ఇంత భావోద్వేగ భరిత చిత్రం చూడలేదని అంటున్నారు. అయితే.. ఈ సినిమాకి వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. కరోనా ఎఫెక్టో, సరైన పబ్లిసిటీ చేసుకోకపోవడమో తెలీదు గానీ - పలాసని అంతంతమాత్రంగానే పట్టించుకున్నారు జనాలు. మౌత్ పబ్లిసిటీతో అయినా వసూళ్లు పెరుగుతాయని చిత్రబృందం ఆశిస్తోంది.
భారీ పబ్లిసిటీతో విడుదలైన ఓ పిట్టకథ... తొలి షో నాటికే తేలిపోయింది. ద్వితీయార్థంలో కొన్ని మలుపులు ఉన్నా - వాటిని రక్తికట్టించే విధంగా మలచలేకపోయాడు దర్శకుడు. తీత కూడా టీవీ సీరియల్ స్థాయిలోనే ఉండిపోయింది. రివ్యూలు, వసూళ్లు రెండూ ఆశాజనకంగా లేవు. అడల్ట్ కంటెంట్‌తో విడుదలైన అనుకున్నదొక్కటీ - అయినది ఒక్కటీ పరిస్థితి కూడా ఇంతే. నలుగురు హీరోయిన్లు ఉన్నా, ఏఒక్కరి పాత్రకూ సరైన ప్రాధాన్యం లేకపోవడం, వాళ్ల గ్లామర్ సైతం ఆకర్షించకపోవడం పెద్ద మైనస్. కాలేజ్ కుమార్ అయితే.. మరింత నాశిరకంగా తయారైంది. ఈ సినిమాని పట్టించుకున్నవాళ్లే లేరు. వీటి మధ్య అర్జున విడుదల కాకపోవడమే మంచిదైందేమో.