ఓ స్టార్ హీరో సినిమా వచ్చిందంటే, రెండు వారాల వరకూ కొత్త సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు భయపడుతుంటారు. అందునా చిరంజీవి లాంటి హీరో సినిమా వదిలితే - బాక్సాఫీసు దగ్గర అడుగుపెట్టడానికి సైతం భయమే. కానీ `సైరా` తరవాత కొన్ని సినిమాలొచ్చాయి. ఆ నిర్మాతల ధైర్యం మెచ్చుకోదగినదే అయినా - ప్రయత్నం మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. సైరా తరవాత వచ్చిన `చాణక్య` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ వారం విడుదలైన రెండు సినిమాలకీ అదే ఫలితం దక్కింది.
ఈవారం `ఆర్‌డిఎక్స్ లవ్`, `వదలడు` చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. `ఆర్‌డిఎక్స్ లవ్` స్ట్రయిట్ సినిమా అయితే, `వదలడు` మాత్రం డబ్బింగ్ బొమ్మ. పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా కావడంతో `ఆర్‌డిఎక్స్ లవ్` పై అంచనాలు నెలకున్నాయి. ట్రైలర్లు కూడా యూత్‌ని టార్గెట్ చేస్తూ కట్ చేయడం వల్ల.. కనీసం యువతరమైనా థియేటర్లకు వస్తుందనుకున్నారు. కానీ.. సినిమాలో విషయం లేకపోవడంతో తొలి రోజే థియేటర్లు ఖాళీ అయ్యాయి. కనీసం మాస్ ఆడియన్స్‌ని సైతం ఈ సినిమా మెప్పించలేకపోయింది.
సినిమాపై నమ్మకంతో నిర్మాత సి.కల్యాణ్ ఎక్కడా రైట్స్ అమ్మలేదు. అన్ని చోట్లా సొంతంగానే విడుదల చేసుకున్నాడు. దాదాపు 8 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యిందని సమాచారం. మూడొంతుల వరకూ నష్టాలే రావొచ్చు. ఇక సిద్దార్థ్ నటించిన సినిమా `వదలడు` కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ నేపథ్యంలో సాగే కథ ఇది. కథ, కథనాలలో కొత్తదనం లేకపోవడంతో సినిమా తేలిపోయింది. పైగా ఓ పక్క సైరా వీర విహారం చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు నిలబడలేవు. ఈవారం కూడా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు `సైరా`నే దిక్కయ్యింది.