'మహర్షి' తో బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. ఆ హవా రెండు వారాలు కొనసాగింది. మూడో వారం నుంచి చిన్న, ఓ మాదిరి చిత్రాలకు థియేటర్లు దొరకడం మొదలయ్యాయి. అందుకే... సినిమాలు వరుస కడుతున్నాయి. 'మహర్షి' హవా తగ్గడంతో నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. ఒకేవారంలో రెండు మూడు సినిమాల్ని సైతం విడుదల చేయడానికి వెనుకంజ వేయడం లేదు. ఈ వారం కూడా సినిమాల హడావుడి ఎక్కువగానే కనిపించింది. తేజ 'సీత' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీతతో పాటు, లీసా.
ఎవడు తక్కువ కాదు చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోరుతూ విడులయ్యాయి. వీటిలో ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన సినిమా మాత్రం 'సీత'నే. తేజ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆయన సినిమాల్లో కాజల్ నటించడం ఇది మూడోసారి. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడం, విడుదలకు ముందు టైటిల్ వివాదం రేగడంతో... 'సీత'పై ఫోకస్ పెంచాయి. అయితే ఈసారి తేజ - కాజల్‌ల మ్యాజిక్ పనిచేయలేదు. తేజ అనుకున్న లైన్ బాగున్నా - దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం విఫలం అయ్యాడు. వినోదం పండకపోవడం, సెకండాఫ్ మరీ సాగదీసినట్టు ఉండడం, బెల్లంకొండ పోషించిన 'స్వాతి ముత్యం' టైపు పాత్ర తేలిపోవడం... వెరసి 'సీత'ని బాగా ఇబ్బంది పెట్టాయి. రివ్యూలు నెగిటీవ్‌గా రావడం వల్ల - ఆ ప్రభావం వసూళ్లపై కూడా పడింది.
ఈ వీకెండ్ కాస్తో కూస్తో కలక్షన్లు వచ్చినా, సోమవారం నుంచి ఈ సినిమా నిలబడడం కష్టమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. అంజలి మరోసారి దెయ్యం అవతారం ఎత్తిన సినిమా 'లీసా'. దెయ్యం కథలు అటు అంజలికి, ఇటు ప్రేక్షకులకు కొత్త కాదు. కాకపోతే ఇది త్రీడీ దెయ్యం. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని తెలుగులో తీర్చిదిద్దిన సినిమా ఇదే. అందుకే... త్రీడీ దెయ్యం ఎలా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. కాకపోతే... హారర్ ఎలిమెంట్స్ తక్కువ ఉండడం, కథ, కథనాల్లో ఏమాత్రం థ్రిల్ లేకపోవడంతో 'లిసా' ప్రయత్నం నెరవేరలేదు. దానికి తోడు ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మొత్తానికి అంజలి ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టే అనుకోవాలి.
లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ కథానాయకుడిగా పరిచయం అయిన చిత్రం 'ఎవడు తక్కువ కాదు'. ఈ సినిమా కూడా ఈ వారమే విడుదలైంది. సీత, లిసా చిత్రాలతో పోలిస్తే... ఈ సినిమాకి ఏమాత్రం పబ్లిసిటీ దక్కలేదు. ఈ సినిమా విడుదల అవుతోందన్న సంగతే చాలామందికి తెలీదు. పైగా... కథ, కథనాలు పేలవంగా సాగడంతో బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా బోల్తా పడింది. వసూళ్ల పరిస్థితీ అంతే. థియేటర్ నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా 'ఎవడు తక్కువ కాదు' సంపాదించలేకపోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ వారం కూడా బాక్సాఫీసుని నిరాశాజనకమైన ఫలితాలు తప్పలేదు. మహర్షిని మరిపించే హిట్ ఎప్పుడొస్తుందో చూడాలి.