సినీ నటి రోజా తాను ఐరన్ లెగ్ కాదనీ, గోల్డెన్ లెగ్ అని అంటున్నారు. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నేతలు తనను ఐరన్ లెగ్ అని విమర్శిస్తూ వచ్చారనీ, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తాను గోల్డెన్ లెగ్ అని నిరూపించుకున్నాననీ, ఆ విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలని రోజా చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబే ఐరన్ లెగ్ అనీ, ఆ పార్టీని చంద్రబాబు భ్రష్టుపట్టించారనీ, నందమూరి కుటుంబం నుంచి టీడీపీని లాక్కున్న చంద్రబాబు, తిరిగి ఆ పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించి రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఇదిలా వుంటే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లో రోజాకి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, రోజా తిరిగి సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపుతున్నారని కూడా వార్తలు వినవస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న రోజా, ఇన్నాళ్ళకు అధికార పార్టీ నేతగా అవకాశం దక్కించుకున్నారు. గతంలో టీడీపీలో వున్నప్పుడూ ప్రతిపక్షం తరఫున పోరాడారు.
ఆ తర్వాత వైసీపీలో చేరాక, అక్కడా ఆమెకు ప్రతిపక్షం తరఫున మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే ఎప్పుడూ ప్రజల్లో వుండడం, ఏ పార్టీలో వున్నా ఆ పార్టీ కోసం కష్టపడటం రోజా ప్రత్యేకత. మంత్రి అయితే జబర్‌దస్త్‌లో కొనసాగుతారా? తిరిగి సినిమాల్లో ఆమె కనిపిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకడంలేదు.