దసరా సంబరాలు టాలీవుడ్‌కి ముందే మొదలైపోయాయి. అక్టోబరు 2న `సైరా` వచ్చి పండగ జోష్‌ని మరింత పెంచింది. 5న చాణక్య కూడా విడుదలైంది. సాధారణంగా చిరంజీవి సినిమా, అందులోనూ పాన్ ఇండియా ట్యాగ్ లైన్‌తో వచ్చిన సినిమాకి పోటీగా మరో సినిమాని రంగంలోకి దించడానికి భయపడుతుంటారు. కానీ... దసరా సీజన్ కాబట్టి చాణక్యుడు కూడా ధైర్యం చేయగలిగాడు. దాంతో పండగ పూట... సినిమా థియేటర్లలో హడావుడి ఎక్కువగా కనిపించింది. భారీ అంచనాలతో విడుదలైన `సైరా` అభిమానుల్ని ఆకట్టుకుంది.
తొలి రోజు నుంచే.. రికార్డు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. నాన్ బాహుబలి రికార్డులు సైతం కొల్లగొట్టింది. తొలి నాటి స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఇది. దాన్ని భారీ స్థాయిలో తీర్చిదిద్దిన విధానం, టెక్నికల్ విలువలు, చిరంజీవి నటన - పతాక సన్నివేశాలు, అందులో చూపించిన భావోద్వేగాలూ ఆకట్టుకున్నాయి. ఫలితంగా చిరంజీవి కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో సైరా అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోయింది. తమిళ, మలయాళ భాషల్లోనూ అంతంతమాత్రంగానే ఆడుతోంది. అయితే తెలుగులో టార్గెట్ ఆడియన్స్‌కి ఈ సినిమా రీచ్ అయ్యింది. పైగా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. అలా.. సైరా తన లక్ష్యాన్ని చేరుకున్నట్టైంది. 5న (శనివారం) చాణక్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ఈ స్పై థ్రిల్లర్‌కి తిరు దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. స్పై థ్రిల్లర్‌లలో ఉండాల్సిన ఉత్కంఠత, ఉత్సాహం కరువై.. ఈ సినిమా బోర్ కొట్టించింది. పతాక దృశ్యాలు, అక్కడక్కడ యాక్షన్ సన్నివేశాలు మినహా.. చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏమీ లేకపోయింది. దాంతో గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టైంది. ఖర్చు భారీగా పెట్టినా - అందుకు తగిన అవుట్ పుట్‌ని దర్శకుడు తిరు ఇవ్వలేకపోయాడు. దానికి తోడు సైరా ప్రభంజనంలో... చాణక్యకు థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. తొలి రెండు రోజుల వసూళ్లు బాగున్నా - చాణక్యకు పెట్టిన బడ్జెట్‌కి అది సరిపోదు. మరి.. ఈ సినిమా అంతిమ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.