దశాబ్దానికి పైగా ఉన్న సీనియర్ హీరోయిన్స్ కెరియర్ ముగిసిపోయింది. ఇక అంతే పెళ్లి పిల్లలు అంటూ ఫ్యామిలీ లైఫ్ చూసుకోవల్సిందే అనుకున్న టైమ్ లో మంచి అవకాశాలతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. త్రిష, నయన తార, అనుష్క, తమన్నా ప్రియమణి మొదలైన వారు ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో తమన్నా రూటే వేరు. పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతూ, ఎలాంటి డిమాండ్స్ చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇరవైఏళ్ళ కిందట వచ్చిన 'శ్రీ' సినిమాతో సినీప్రయాణం మొదలుపెట్టి, యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అందరితో ఆడి పాడింది. 'హ్యాపీ డేస్' తో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకొని అప్పటినుంచి వెనుతిరిగి చూసుకోలేదు. అన్ని భాషల్లోనూ మెరుస్తూనే ఉంది. సినిమా , వెబ్ సిరీస్, ఐటమ్ సాంగ్ ఏదైనా కానీ ఓకే చెప్తూ తన సత్తా చాటుతోంది.
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి భోళా శంకర్ మూవీతో అలరించింది. ఇది డిజాస్టర్ కావటంతో తమన్నా పనైపోయిందని, ఇక అవకాశాలు రావని కామెంట్స్ వినిపించాయి. కానీ తమన్నా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగించి ఇప్పటికీ లైమ్ లైట్ లో ఉంటుందంటే మాటలు కాదు.ఇప్పుడు కూడా మెయిన్ హీరోయిన్ గా కొన్ని అవకాశాలు అందుకుంటోంది. హిందీలో పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు అలా తన హార్డ్ వర్క్ తో లేటెస్ట్ గా మరొక క్రేజీ ఆఫర్ అందుకుంది ఈ మిల్క్ బ్యూటీ.
ఎంఎస్ ధోనీ, రుస్తుం, టాయిలెట్, చిత్రాల దర్శకుడు నీరజ్ పాండే తమన్నాని ఒక వెబ్ సిరీస్ కోసం సంప్రదించినట్టు సమాచారం. అల్ రెడీ 'ది ఫ్రీలాన్సర్' అనే వెబ్ సిరీస్ తో మెప్పించిన నీరజ్ పాండే కొత్త వెబ్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నాడట. ఇందులో తమన్నా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. ముంబయిలో జరిగే క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు ముగిసినట్టే అని త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. కుదిరితే ఈ ఏడాది లోనే ఈ సిరీస్ రిలీజ్ కానున్నట్లు టాక్. త్వరలోనే ఈ సిరీస్ డీటెయిల్స్ అనౌన్స్ చేయనున్నారు.