దేశం మొత్తం గర్వించదగిన డాన్సర్ చిరంజీవి. టాలీవుడ్ కి బ్రేకు డాన్సులు, షేకు డాన్సులూ నేర్పించిన ఘనత తనదే. ఈతరానికి కూడా డాన్సుల్లో చిరునే ఆదర్శం. డాన్సుల విషయంలో కథానాయికల్లో అంతటి చరిష్మా ఉన్న నాయిక తమన్నా. వీరిద్దరూ కలిసి డాన్సులు చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా? `భోళా శంకర్`లో వీరిద్దరి డాన్సులు చూసే అవకాశం దక్కబోతోంది. చిరంజీవి కథానాయకుడిగా `భోళా శంకర్` రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన `వేదాళం`కి ఇది రీమేక్.చిరు సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమాలో వీరిద్దరి డాన్సులు అదిరిపోతాయని మెహర్‌రమేష్ చెబుతున్నాడు. ''సైరాలో చిరు, తమన్నా కలిసి నటించారు. కానీ. అందులో... తమన్నా చాలా ఉద్వేగ భరితమైన పాత్ర పోషించింది. అయితే ఈసారి పూర్తిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. తను చాలా నాటీగా ఉంటుంది. చిరు - తమన్నాల మధ్య మంచి డాన్స్ నెంబర్లు కూడా సెట్ చేశాం'' అని మెహర్ రమేష్ చెబుతున్నారు. తమన్నా కూడా చిరుతో మరోసారి కలసి నటించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ఈనెల 15 నుంచి హైదరాబాద్ లోనే భోళా శంకర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మహతి సాగర్ స్వరాలను అందిస్తున్నారు.