చాలా తక్కువ టైమ్ లోనే టాప్ స్టార్ గా ఎదిగింది తమన్నా. ఒకటా రెండా... అన్నీ హిట్లే. ఓ దశలో టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల్లో తమన్నా పేరు ముందు వరుసలో ఉండేది. ఐటెమ్ గీతాలకూ అడ్డు చెప్పకపోవడంతో తమన్నా కెరీర్ జెట్ స్పీడులో దూసుకుపోయింది. అయితే.. ఈ ప్రయాణంలో పరాజయాలూ తప్పలేదు. సాధారణంగా హిట్ వచ్చినప్పుడు హీరోయిన్ల రేంజు పెరుగుతుంది. ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ ప్రభావం అంతంగా కనిపించదు. కానీ హిమ్మత్ వాలా ఫ్లాపుతో తమన్నా బాగా ఇబ్బంది పడింది. హిందీనాట పాగా వేయాలన్న తన కలలు కరిగిపోయాయి. దాంతో పాటు దక్షిణాదినా తన ఇమేజ్‌కి డామేజ్ జరిగింది.
అందుకే తన కెరీర్‌లో ఎదురైన ఈ ఫ్లాపుని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనంటోంది తమన్నా. ''హిమ్మత్ వాలాపై చాలా ఆశలు పెట్టుకున్నా. మీడియా కూడా నన్ను బాగా ఫోకస్ చేసింది. శ్రీదేవితో పోల్చి చూసింది. దాంతో నాకూ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. మరోసారి బాలీవుడ్ వెళ్లాలంటే భయపడేలా చేసింది ఆ సినిమా. అందుకే ఎప్పటికీ ఆ పరాభవం మర్చిపోలేకపోతున్నా. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదన్న పాఠం మాత్రం ఈ సినిమాతో నాకు తెలిసింది'' అని చెప్పుకొచ్చింది తమన్నా.