హీరోగా, నిర్మాతగా, నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు విశాల్. ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా తమిళనాట నిర్మాతలకూ, విశాల్‌కీ మధ్య వర్గ పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదం ముదిరి పాకాన పడింది. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్‌ని పోలీసులు అరెస్ట్ చేసేంతదాకా వెళ్లింది.
అసలు వివరాల్లోకి వెళితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాతల మండలి ఆఫీసుకు తాళం వేయడంతో, ఆ తాళాన్ని తీయడానికి ప్రయత్నించిన విశాల్‌ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, విశాల్‌కూ మధ్య వాగ్వాదం జరగడంతో విశాల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వారం ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలా ఒకేరోజు అన్ని సినిమాల విడుదలకు పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ నిర్మాతలు ఆందోళనలు చేపట్టారు. అలాగే పైరసీ విషయంలోనూ విశాల్‌కి వ్యతిరేకత ఉంది. పైరసీ సినిమాల వెబ్‌సైట్ తమిళ రాకర్స్‌లో విశాల్‌కి వాటా ఉందంటూ నిర్మాతల్లో కొందరు ఆందోళన చేపట్టారు.
ఈ విషయంలో విశాల్‌కి అత్యంత సన్నిహితులు కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాల్ అరెస్టుకు పోలీసులు సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే, 'గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాతల మండలికి తాళం వేసినప్పుడు రాని పోలీసులు, ఏ తప్పు చేయని మమ్మల్నెందుకు అరెస్టు చేశారు..? ఇదెక్కడి న్యాయం. దీనిపై పోరాటం చేస్తాం..' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.