ఇటీవలే 2.ఓ సినిమా తో ప్రేక్షకులని అలరించిన సూపర్ స్టార్ రజినీకాంత్ అతి కొద్ది గ్యాప్ లోనే మళ్ళీ వెండి తెరపై కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ సినిమా ఆలస్యంగా రిలీజ్ కావడంతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు సినిమాలతో అభిమానులను అలరించనున్నాడు రజినీకాంత్. తాజా వార్తల ప్రకారం, యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ హీరోగా నటించిన చిత్రం పెట్ట జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
అయితే, ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రిలీజ్ పై అనుమానాలు ఏర్పడుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా, పెట్ట తెలుగు ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టకపోవడంతో, ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా చెప్పిన తేదీనే విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే, ఈ సినిమా తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ దక్కించుకున్నారు.
తెలుగులో బాలకృష్ణ 'ఎన్టీఆర్ బయోపిక్', వెంకటేష్ - వరుణ్ ల 'ఎఫ్ 2' మరియు రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలు సంక్రాంతి పోరులో పోటీ పడనున్నాయి. దీంతో పెట్ట టీం తెలుగులో సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారా.. అందుకే తెలుగు ప్రమోషన్స్ ఇంకా ప్రారంభించలేదేమో..! త్రిష, సిమ్రాన్ లు ఈ సినిమాలో రజినీ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.