సినిమా రంగానికి, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది అన్నది కాదనలేని నిజం. సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినవారు అన్ని భాషల్లోనూ ఉన్నారు. వీరిలో కొందరు మాత్రమే సొంతంగా పార్టీ పెట్టి, ప్రజల ఆధరణకి నోచుకున్నారు. మరికొందరు ఇతర పార్టీల్లో కొనసాగుతున్నవారు ఉన్నారు. తమిళనాట సినిమా వాళ్లే రాజకీయరంగంలో చరిత్ర సృష్టించారు. జయలలిత, ఎంజీఆర్, వీరిలో ముఖ్యులు . కమల్ హాసన్ కూడా పార్టీ స్థాపించారు. లేటెస్ట్ గా దళపతి విజయ్ 'తమిళ్ వెట్రి కజగం' అన్న పార్టీని అనౌన్స్ చేసాడు. ఇప్పుడు విశాల్ కూడా విజయ్ బాటలోనే కొత్త పార్టీ స్థాపిస్తాడని కోలివుడ్ మీడియా కోడై కూసింది.
విశాల్ నిత్యం ప్రజా సేవలో ఉంటారు. తన ఫ్యాన్ క్లబ్ ద్వారా ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాలు మరింత పెద్దగా చేపట్టాలని నిర్ణయించుకున్నారట విశాల్. నియోజకవర్గాలకే పరిమితం చేయకుండా జిల్లాల వారీగా, ప్రజలకి తన అవసరం ఎక్కడ ఉంటే అక్కడ సేవ చేయాలని భావిస్తున్నారట. తన తల్లి పేరుమీద దేవీ ఫౌండేషన్ స్థాపించారు. దీని ద్వారా నిరుపేద విద్యార్ధుల చదువుల కోసం విశాల్ సాయం అందిస్తున్నారు. విశాల్ చేస్తున్న ఈ సేవలు అన్ని రాజకీయ తెరంగ్రేటానికే అని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై విశాల్ స్పందిస్తూ, తన రాజకీయ ప్రయాణం గూర్చి, పార్టీ గూర్చి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి తనకా ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన ఫ్యాన్ క్లబ్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదని విశాల్ వెల్లడించారు. భవిష్యత్తులో అని అడగ్గా భవిష్యత్తు సంగతి ఇప్పుడు చెప్పలేనని చెప్పారు. ఈ అంశాలపై విశాల్ తన ట్విట్టర్‌లో ఒక లేఖ కూడా షేర్ చేయగా ప్రజంట్ ఈ లెటర్ సొషల్మీడియాలో వైరల్ అవుతోంది.