ఈ సంక్రాంతికి తమిళనాట విడుదల కాబోతున్న పెద్ద సినిమా `మాస్టర్`. విజయ్ అక్కడో సూపర్ స్టార్. పైగా ఖైదీ తరవాత... లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. టీజర్ ఇప్పటికే కేక పుట్టించింది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టే తమిళనాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చింది. దాంతో.. `మాస్టర్` కొత్త రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని అక్కడి సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
అయితే.. ఈలోగా ఈ సినిమాకి కొత్త టెన్షన్ వచ్చి పడింది. తమిళనాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీ కి అనుమతులు ఇవ్వడం అక్కడి విపక్షాలకు నచ్చలేదు. కోవిడ్ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని? వెంటనే... ఈ జీవో ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. అంతే కాదు,.. విజయ్ కోసం తమిళ నాడు ప్రభుత్వం పనిచేస్తుందా? పెద్ద హీరోలకు మాత్రమే కొమ్ము కాస్తుందా? అంటూ... విపక్షాలు హేళన చేస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకుల కోలాహలం వల్ల కోవిడ్ కేసులు పెరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని.. అక్కడి ప్రతిపక్షాలు విమర్శనా బాణాలు ఎక్కుపెట్టాయి. దాంతో తమిళనాడు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ జీవో ఎక్కడ ఉపసంహరించుకుంటారో అని.. `మాస్టర్` టీమ్ బిక్కుబిక్కుమంటూ వుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.