నిన్న తెలుగు భాషా దినోత్సవం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తెలుగు వాడకం గురించిన చర్చ మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలుగు సినిమాల్లో తెలుగు మాటల్ని, పదాల్నీ ఖూనీ చేస్తున్నారన్న ఫిర్యాదు ఇప్పటిది కాదు. ఇప్పుడు ఈ విషయంపైనే ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది హీరోలకు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం రాదని గుర్తు చేశారు. తెలుగు పాటల్లో తెలుగు భాష ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భాష రాని వాళ్లని గాయకులుగా పెట్టుకోవడం వల్ల కళ్లు, కల్లు అనే పదాలకు తేడా తెలియకుండా పోతోందని, తెలుగు వచ్చిన గాయకులు కూడా... తెలుగు రాని వాళ్లని అనుకరించడం మొదలెట్టడం ఓ ఫ్యాషన్‌గా భావిస్తున్నారని దాంతో తెలుగు భాష అధోగతి పాలవుతోందని గట్టిగానే విమర్శించారు తమ్మారెడ్డి.
ఏ విషయంపైనైనా నిర్మొహమాటంగా గళం విప్పే వ్యక్తి తమ్మారెడ్డి. ఆయన దృష్టి ఇప్పుడు తెలుగు భాషా వికాసంపై పడింది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తమ్మారెడ్డి కీలకమైన, విలువైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి ఒకరిద్దరు మాత్రమే ప్రెస్ మీట్లలోనూ తెలుగే మాట్లాడుతున్నారని, ప్రకాష్ రాజ్ ది తెలుగు నేల కాకపోయినా, తెలుగు నేర్చుకొని, అనర్గళంగా తెలుగులోనే మాట్లాడుతున్నాని, ఆ అంకితభావం మిగిలిన హీరోల్లో కనిపించడం లేదని తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.