తెలుగులో కథానాయికల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే... పరాయి ప్రాంతాల నుంచి హీరోయిన్లని వెదికి మరీ పట్టుకొస్తుంటారు. అలా అడుగు పెట్టిన నాయికల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. హిందీలో కొన్ని సినిమాలు చేసిన మృణాల్‌కి అక్కడ సరైన విజయం పడలేదు. అయితే తెలుగులో చేసిన తొలి సినిమా `సీతారామం` సూపర్ హిట్టయ్యింది. సీతగా మృణాల్ పాత్ర బాగా ఆకట్టుకొంది. ఈ అమ్మాయి.. గ్లామరెస్ పాత్రలకూ బాగానే ఉంటుంది అన్న భావన మన దర్శకులలో మొదలైపోయింది. అందుకే మృణాల్ ని సంప్రదించడం మొదలెట్టారు. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలపై మృణాల్ సంతకాలు చేసిందని టాక్. ఇప్పుడు తన పారితోషికంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందని టాక్.
ఈ మధ్య తెలుగులో చాలామంది కథానాయికలు తొలి సినిమాతో హిట్టు కొట్టి, ఆ తరవాత అమాంతంగా పారితోషికం పెంచేశారు. అయితే వాళ్లెవరూ కూడా ఒక్క సినిమాకే కోటి అందుకోలేదు. అందుకోసం కొంత కాలం ఎదురు చూడాల్సివచ్చేది. కానీ మృణాల్ అలా కాదు. ఇలా హిట్టు కొట్టిందో లేదో, అలా కోటి అడిగేసింది. మనకెలాగూ హీరోయిన్ల కొరత ఉంది కాబట్టి.. మృణాల్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయిపోతున్నారని తెలుస్తోంది. ఒక్క హిట్టు పడితేనే సీత చుక్కలు చూపించేస్తోందంటే, మరో హిట్టు కొడితే ఇంకేమైనా ఉందా..?