సూపర్ స్టార్ కృష్ణ - దర్శకుడు , నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజల మధ్య పెద్ద గొడవే నడిచింది. కృష్ణ ఫ్యాన్స్ తమ్మారెడ్డి ఇంటిపై దాడి చేయడం, ఆయన కేసులు పెట్టడం, ఛాంబర్ లో గొడవ పడటం.. కేసులు కారణంగా కృష్ణ ఫ్యాన్స్ జైల్లో వుండటం ఇదంతా గతం. అయితే ఈ గొడవకు గల కారణాలని తాజాగా ఇచ్చిన ఓ కార్యక్రమంలో వివరంగా పంచుకున్నారు తామ్మారెడ్డిభరద్వాజ.
'రౌడీ అన్నయ్య' లో సిల్క్ స్మితతో ఓ పాట పెట్టాం. బాబు మోహన్ పాత్రకి సిల్క్ అంటే ఇష్టం. బాబు మోహన్ పాత్ర దగ్గర ఒక రహస్యం వుంటుంది. సిల్క్ మొహంలో పడి ఆ రహస్యం చెప్పేయాలి. ఇది మొదట అనుకున్న స్క్రీన్ ప్లే. దాని కోసం ఓ పాట పెట్టాం. ఐతే ఆ పాటలో కృష్ణ గారు కూడా డ్యాన్స్ చేస్తా అన్నారు. కృష్ణ గారి లాంటి హీరో ఇలా అల్లరి చిల్లరిగా డ్యాన్స్ చేయడం ఏమిటని నేను ఒప్పుకోలేదు. కానీ కృష్ణ గారు చేస్తాననే పట్టుబట్టారు. అ పాట నేను చేయలేనని బయటికి వచ్చేశాను. నిర్మాతలు కృష్ణ గారితో బాబు మోహన్ తో రెండు వెర్షన్లు షూట్ చేశారు. తీరా సెన్సార్ బోర్డ్ ఆ పాటని కట్ చేయాలని పట్టుబట్టింది. కృష్ణ గారు వెళ్లి చూసి షాక్ అయ్యారు. సెన్సార్ లో వుంది బాబు మోహన్ వెర్షన్ పాట. ఈ కుట్ర మాత్రం నాదే. కృష్ణ గారు చాలా హుందాగా నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి 'ఈ రోజుతో మన ఫ్రండ్సిప్ కట్' అన్నారు. తర్వాత పాట మరో వెర్షన్ షూట్ చూసి రిలీజ్ చేశారు.
అయితే నాపై కృష్ణ గారి ఫ్యాన్స్ ఆగ్రహించారు. దాడులు చేశారు. నేనూ కేసులు పెట్టాను. దాడులు చేసిన వారు జైల్లో కూడా వున్నారు. నాలుగేళ్ళు నేను కృష్ణ గారు మాట్లాడుకోలేదు. తర్వాత ఆయనే కేసులు విత్ డ్రా చేసుకోవచ్చు కదా అని కోరారు. నేను కూడా పంతం తగ్గించుకొని కేసులు విత్ డ్రా చేసుకున్నా. తర్వాత అంతా కలసిపోయాం. ఐతే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చూసిన తర్వాత కృష్ణ గారు చెప్పింది నిజమే అనిపించింది. ఇందులో పవన్ కళ్యాణ్, బ్రాహ్మనంద పాత్ర కోసం ఆడ వేషాలు , నాటకం వేశారు. ఒక మాస్ హీరో చిల్లర డ్యాన్స్ లు చేయకూడదని నా పట్టు. కృష్ణ గారు ఆ రోజే ఫ్యాన్స్ నాడీ పట్టుకున్నారు. హీరో డ్యాన్స్ చేస్తేనే అభిమానులకు ఇష్టం. ఈ రకంగాఅప్పుడు కృష్ణ గారు చెప్పిందే కరక్ట్'' అని నాటి సంగతులని గుర్తు చేసుకున్నారు తామ్మారెడ్డి భరద్వాజ.