చిత్రసీమలో ఎటు చూసినా టికెట్ రేట్ల వ్యవహారంపై హాట్ హాట్ చర్చే నడుస్తోంది. అంతా తలో మాటా మాట్లాడుతున్నారు. అయితే పరిశ్రమ వైపు నుంచి మాట్లాడే పెద్ద దిక్కు మాత్రం లేకుండా పోయింది. రాజకీయ నాయకుల్లో కొందరు సినిమావాళ్లని టార్గెట్ చేస్తున్నారు. `సినిమా వాళ్లు తెగ బలిసి కొట్టుకుంటున్నారు..` అని ఓనేత ఇటీవల వ్యాఖ్యానించడం వివాదం రేపుతోంది. ఈ వ్యవహారాలన్నింటిపైనా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా స్పందించారు.
ఏ సమస్య అయినా చర్చలతోనే పరిష్కారం అవుతుందని, అవాకులూ చెవాకులూ పేలితే.. సమస్య మరింత జటిలం అవుతుందని, అందుకే అందరూ కంట్రోల్ లో ఉండాలని కోరారు. టికెట్ రేట్లు పెంచడం, తగ్గించడం ప్రభుత్వం చేతుల్లో ఉందని, అయితే అందరికీ అందుబాటులో ఉండే ధరని నిర్ణయిస్తే మంచిదని వ్యాఖ్‌యానించారు. టికెట్ రేటు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉందో, తగ్గించేందుకు ఆంధ్రా ప్రభుత్వానికీ అంతే హక్కు ఉందన్నారు.
''ఇటీవలే ఓ రాజకీయనాయకుడు సినిమావారిని నిందిచడం ఆశ్చర్యం కలిగింది. ఇండస్ట్రీ వారికీ సిగ్గులేదు, దమ్ము లేదు. సినిమా వారికి బలిసిందని అంటున్నారు. ఇక్కడ ఎవరికీ బలుపులేదు. ఇక్కడ అందరూ ఇక్కడ దైర్యవంతులే, సామరస్యం గా సమస్య ను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. అంతేకానీ మాలా రెచ్చగొట్టధోరణి మాది కాదు. కొంతమంది ఎవరి మెప్పుకోసం తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇక మరో వ్యక్తి ప్రొడక్ట్ కు ధర నిర్ణయించుకునే అవకాశం నిర్మాతలకూ ఉంటుంది అన్నారు.
అది కరెక్టే. అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని రూల్స్ వుంటాయి. వాటి ప్రకారమే టిక్కట్ రేటు కూడా పెంచుకునే అవకాశం వుంటుంది. ఇలా భిన్నమైన వాతావరణ వున్నప్పుడు చర్చలతో సమస్య పరిష్కారం అవుతుంది తప్ప అవాకకులు చెవాకులు పేలితే సమస్య మరింత జటిలమవుతోంది. ఇందుకు మీడియాకూడా సమన్వయం పాటించాల''అన్నారు తమ్మారెడ్డి.