టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసుకు సంబంధించి, మూడు రోజుల విచారణ తర్వాత నాలుగో రోజు విచారణకు తరుణ్ వంతు వచ్చింది. మొదటి రోజు డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ని విచారించిన సిట్ అధికారులు, రెండో రోజు శ్యామ్ కె, నాయుడు, మూడో రోజు సుబ్బరాజును విచారించగా, ఈ రోజు యంగ్ హీరో తరుణ్‌ని విచారించనున్నారు. సిట్ ఎదుట విచారణకు తరుణ్ ఈ రోజు ఉదయం 9.30 గంటలకు సిట్ కార్యాలయానికి హాజరయ్యాడు. తన తండ్రిని వెంట తీసుకుని తరుణ్ సిట్ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లాడు. గతంలో తరుణ్‌కి ఓ పబ్ ఉండేది. కానీ ఇప్పుడు దాంతో ఆయనకి ఏ సంబంధం లేదంట. ఆర్నెళ్ల క్రితమే ఆ పబ్ నిర్వహణని వదిలేసినట్లు తరుణ్ చెప్పాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తరుణ్ పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగా మారి పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించాడు. అయితే చాలా కాలంగా తరుణ్‌కి సినిమాల్లో అంతగా సక్సెస్ లేదు. దాంతో మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యే మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. లేటెస్టుగా 'ఇది నా లవ్‌స్టోరీ' సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ లోగా ఈ డ్రగ్స్ గొడవ తరుణ్‌ని వెంటాడుతోంది. డ్రగ్స్‌తో తనకెలాంటి సంబంధం లేదనీ, ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలు, కెరీర్‌పైనే ఉందని తరుణ్ చెబుతున్నాడు.