సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నుండి ఏ సినిమా వచ్చినా, మొదట వివాదాస్పదమవుతూ ఉంటాయి. అయినా ఆయన ఏమాత్రం తొణకరు. వివాదాలతో నిత్యం సావాసం చేస్తుంటారు. తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్రమైంది. లేటెస్టుగా ఈ సినిమా నుండి విడుదల చేసిన 'వెన్నుపోటు' పాటే ఈ వివాదాలకు కారణం. ఈ పాట చంద్రబాబుపై నెగిటివ్ ప్రచారం చేసేలా ఉండడంతో టీడీపీ శ్రేణుల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కేసులు పెడుతున్నారు. వర్మ మాత్రం దేనికీ భయపడనంటున్నాడు. వాస్తవానికి వర్మకి వివాదాలు కొత్త కాదు. కేసులు, వివాదాలు అంటే ఫ్రీ పబ్లిసిటీ అనుకునే రకం వర్మ. కేసులు పెడుతున్నారంటే నా సినిమాకి వాళ్లు భయపడుతున్నట్లే లెక్క అంటున్నారు. 'ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా కుట్ర జరిగింది.. ఆ విషయాన్ని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు.
నేను సినిమా కోసం వక్రీకరించింది ఏమీ లేదు. ఎన్టీఆర్ చెప్పిన మాటలు, నా సినిమాలోని విషయాన్ని చూసి నిజానిజాల్ని ప్రజలు బేరీజు వేసుకుంటారు. నచ్చిన వాళ్లే నా సినిమా చూస్తారు. సినిమా చూడండి అని నేను ఎవర్నీ బలవంతం చేయను. కేసులు పెట్టుకోవచ్చు. ఆందోళనలు చేసుకోవచ్చు. నేనెవర్నీ అడ్డుకోను..' అని వర్మ అంటున్నారు.