మీడియా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండాలి. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతీ పేపర్, ప్రతీ టీవీ ఛానల్ వెనుక ఓ పార్టీ హస్తం ఉంటోంది. ప్రతీ మీడియా సంస్థ ఏదో ఓ పార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఆ పార్టీని ఎత్తేయడానికి, మరో పార్టీని పడేయడానికి చూస్తుంటుంది. వీలైనంత నెగిటివిటీ పంచడానికి ప్రయత్నించేవాళ్లే తప్ప.. పాజిటీవ్ విషయాల గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడం ప్రజల దౌర్బాగ్యం.
ఇటీవల చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఇక నుంచి చిరు తన జేబులోంచి ప్రతీ రోజూ డబ్బులు తీయాల్సిందే. నిజంగా ఇదో బృహత్తర కార్యక్రమం. కానీ.. తెలుగు మీడియా మాత్రం చిరు సేవని ఏమాత్రం పట్టించుకోలేదు. దానికి సంబంధించిన కవరేజీ ఇవ్వలేదు. కొన్ని పేపర్లు మాత్రం తు.తు మంత్రంగా ప్రవర్తించాయంతే. ఈ విషయం తెలిసి చిరు వర్గం బాధ పడుతోంది. సోనూసూద్ తో చిరుని పోలుస్తూ.... చిరు ఏమాత్రం సేవ చేయడం లేదని విమర్శించిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు? అంటూ చిరు వర్గం నిలదీస్తోంది. ఒకరుతప్పు చేస్తే విమర్శించడం తప్పు కాదు. ఒకరు మంచి పని చేస్తే... మెచ్చుకోళ్లు అందివ్వకపోవడం తప్పు. పైగా... చిరు ఇది తన పబ్లిసిటీ కోసం చేస్తున్నాడని, సోనూసూద్ కి వచ్చిన క్రేజ్ మర్చిపోవడానికి చేస్తున్నాడని, ఓ వర్గం బాహాటంగానే విమర్శలు ఎక్కుపెట్టింది.
ఇది ఇంకా పెద్ద తప్పు. ఎవరు చేసినా.. ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడాలనుకోవడం గొప్ప పని. పైగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని, ప్రతీ జిల్లాలోనూ ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ సంగతి మీడియాకీ తెలుసు. కానీ... ప్రభుత్వాలు చేయాల్సిన పని.. చిరు చేస్తున్నాడని ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న పత్రికలు రాయలేవు. అదేంటో.. ప్రతిపక్ష పాత్రనీ పోషిస్తున్న పత్రికలూ అదే దారిలో వెళ్తున్నాయి. అలా.. చిరు సాయాన్ని... మీడియా గుర్తించడం లేదు. కాకపోతే.. సోషల్ మీడియా ఒకటుందిగా. అక్కడ మాత్రం చిరుకి వీరతాళ్లు పడుతున్నాయి. ఇది చిరుకి మరింత స్ఫూర్తినివ్వాలి. మరిన్ని మంచి పనులకు ప్రోత్సాహం అందించాలి.