'ఎల్బీడబ్యూ', 'రొటీన్ లవ్ స్టోరీ', 'చందమామ కథలు' వంటి చిన్న సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, నేషనల్ అవార్ట్ గ్రహీతగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. అంతకు ముందు వరకూ చాలా కొద్ది మందికే తెలిసిన ఈ డైరెక్టర్ రాజశేఖర్‌తో 'గరుడవేగ' చిత్రాన్ని తెరకెక్కించడం ద్వారా, మొత్తం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడంతో పాటు, ఆడియన్స్ దృష్టిలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 'గరుడవేగ'తో తన రేంజ్ పెంచుకోవడంతో పాటు, సీనియర్ హీరో రాజశేఖర్ ఉనికిని కూడా నిలబెట్టాడు.
ఆ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు యంగ్ హీరో రామ్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా యాక్షన్ అడ్వెంచర్‌గానే తెరకెక్కుతోందట. తాజాగా స్టార్ట్ అయిన ఈ సినిమా మేలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. జార్జియా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లోని సుందరమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుందట. ఆయా దేశాల్లోని సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగాక, కశ్మీర్‌లోని పాపులర్ ప్రదేశాల్లో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారట.
మైనస్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య తెరకెక్కించే యాక్షన్ ఘట్టాలు సినిమా స్థాయిని పెంచేలా ఉండబోతున్నాయట. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నారట. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌లో రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.