ఓటీటీ హవా నడుస్తోందిప్పుడు. ఇదెంతకాలమో చెప్పలేం గానీ, థియేటర్ వ్యవస్థ పూర్తిగా గాడిన పడేంత వరకూ ఓటీటీ ప్రభావం తప్పకుండా ఉంటుందనేది కాదనలేని సత్యం. నిజానికి ఓటీటీ రిలీజ్‌కి పెద్ద హీరోలు సిద్ధంగా లేరు. థియేటర్లో సినిమా విడుదలైతే, అది హిట్టయితే వచ్చే కిక్ ఓటీటీలో లేదన్నది వాళ్ల నమ్మకం. అందుకే.. పెద్ద సినిమాలు ఓటీటీ ముందుకు వెళ్లలేకపోతున్నాయి. అయితే.. క్రమంగా పెద్ద హీరోలూ మనసు మార్చుకుంటున్నారు. నిర్మాతలను దృష్టిలో ఉంచుకునో, భవిష్యత్తుని అంచనా వేసో.. ఓటీటీకి ఓకే అంటున్నారు.
నిజం చెప్పాలంటే.. ఓటీటీ లో సినిమా విడుదల కావడంలోనూ హీరోలకు కొంత సుఖం ఉంది. కొన్ని సౌలభ్యాలున్నాయి. సినిమా విడుదలకు ముందు ఉండే టెన్షన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత కష్టపడినా - అంతిమంగా ప్రేక్షకులే తీర్పు చెప్పాలి. విడుదల రోజున టాక్ ఎలా వుందో? వసూళ్లెన్నో? హిట్టో, ఫట్లో.. అనే అనుమానాలూ, సందేహాలూ.. ఇప్పుడు ఓటీటీలో కనిపించవు. ప్రచారం చేయడానికి రాత్రీ పగలూ తేడా లేకుండా.. ఊరూరా తిరిగే అవసరం లేదు. ప్రెస్ మీట్లూ, ఇంటర్వ్యూలూ లేవు. `మా సినిమా ఇరగాడేస్తుంది ` అని డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మహా అయితే.. ఇంటి పట్టున ఉంటూనే జూమ్‌లోనో, ఫోన్లలోనో ప్రమోషన్లు చేసుకోవొచ్చు. సినిమా వసూళ్ల లెక్కలు ఇప్పుడు అవసరం లేదు. `అమేజాన్ ప్రైమ్ లో ఇంత మంది చూశారు`అని ఎన్ని లెక్కలైనా వేసుకోవొచ్చు. పైగా.. వాటికి సంబంధించిన అధికార డేటా అంటూ ఏమీ ఉండదు.
యూ ట్యూబ్ లా.. క్రింద హిట్లూ, వ్యూసూ, లైక్సూ, కామెంట్లూ కనిపించవు. కాబట్టి.. ఎంత చెబితే అంత. సినిమా బాగుంటే... `థియేటర్లో విడుదలైతే ఇంకా బాగుండేది` అని చెప్పుకోవొచ్చు. బాగాలేకపోతే.. `థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఓటీటీలోకి ఎందుకొస్తుంది` అని సర్ది చెప్పవొచ్చు. ఈ హిట్లూ, ఫ్లాపూ లెక్కలోనికి రావు. ఒకవేళ అన్నీ బాగుంటే.. థియేటర్లు రీ ఓపెన్ చేశాక.. మళ్లీ బొమ్మని ఓసారి విడుదల చేసుకుని సంతృప్తి పడొచ్చు. ఇలా ఎలా చూసినా.. ఓటీటీలో సినిమా విడుదల కావడమే.. హీరోలకు రిస్కు లేని వ్యాపారంలా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మీడియం రేంజు హీరోలకు.