కాపీ క్యాట్ అని పిలిపించుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ తమన్‌పై పదే పదే ఆ ముద్ర పడిపోతోంది. ప్రతీ సినిమాకీ ఒక్క ట్యూన్ అయినా `కాపీ` అనిపించుకుంటోంది. కానీ తమన్ అవేం పట్టించుకోడు. `నేను కాపీ కొట్టడం లేదు` అని వాదిస్తుంటాడు. తన పద్ధతి ఏమాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా.. మరోసారి తమన్ కాపీ ట్యూన్ వ్యవహారం బయటకు వచ్చింది. మంగళవారం `టక్ జగదీష్` టీజర్ విడుదలైంది.
టీజర్లో ఈ సారి పాట వినిపించారు. `నిన్ను చూసి నికరంగా రొమ్ము విరుచు కున్నాది` అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో సాగింది. ఈ పాట చూస్తుంటే.. `అల వైకుంఠపురములో`... `సిత్తరాల సిరపడు.. ` పాట గుర్తుకొస్తుంది. టేకింగ్ కూడా అలానే సాగింది. దాంతో.. తన పాటని తానే కాపీ కొట్టుకున్నట్టైంది. ఈ టీజర్ పై, తమన్ పై ఇప్పుడు బోలెడన్ని సెటైర్లు పడుతున్నాయి. తమన్ ఇక మారడా..? అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుకుంటున్నారు. తొలి పాటపైనే కాపీ ముద్ర పడితే... మిగిలిన పాటలెలా ఉంటాయో..? దీనిపై తమన్ స్పందనేమిటో??