ఏదేమైనా బోయపాటి శ్రీను నోటికి స్పీడెక్కువ. `నేనే చేశాను. నేనే చేయించుకొన్నా.` అనే టైపులో మాట్లాడ్డం కొన్నిసార్లు జనాలు చూశారు కూడా. `లెజెండ్` టైమ్‌లో దేవిశ్రీ ప్రసాద్ ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో.. `నేను మ్యూజిక్ కోసం దేవిని పిండేశాను.. పడుకోనివ్వలేదు..` అంటూ స్టేజీపై ఏదేదో మాట్లాడాడు. దానికి వెంటనే దేవి కూడా రియాక్ట్ అయ్యాడు. `నేను ఆవునో దూడనో కాదు పిండుకోవడానికి.. ఒకరు పడుకోనివ్వకపోవడం ఏమిటి? పని పూర్తయ్యేంత వరకూ నేనే పడుకోను` అంటూ అక్కడికక్కడ కౌంటర్ ఇచ్చేశాడు.
ఇప్పుడు తమన్ వంతు వచ్చింది. `అఖండ` సినిమాకి తమన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. తన ఎలివేషన్లతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇదే విషయం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే.. `ఆర్. ఆర్ లేకపోయినా, మ్యూట్ లో చూసినా ఆ సీన్లు బ్రహ్మాండంగా ఉంటాయి` అంటూ హెచ్చులకు పోయాడు బోయపాటి. అంటే.. క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవాలన్న తపన అన్నమాట. ఇటీవల విడుదలైన `స్కంద`లో పాటలు మైనస్. ఆర్.ఆర్‌కీ అంత స్కోప్ లేకుండా పోయింది. దీనిపై కూడా బోయపాటి స్పందించాడు. `మ్యూజిక్ మైనస్ అని నాతో కూడా కొంతమంది అన్నారు` అంటూ పరోక్షంగా తమన్ పనితనాన్ని శంకించాడు. అంటే.. `అఖండ`లో సంగీతం ప్లస్ అయితే దాని క్రెడిట్ తాను తీసుకొన్నాడు. స్కందలో అదే తమన్ తో చేయించిన పాటలు బాగోకపోతే.. ఆ మైనస్సు మార్కులన్నీ.. తమన్ ఖాతాలో వేసేశాడు.
తమన్ తన ట్విట్టర్ ఖాతాలో `ఐ డోంట్ కేర్` అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇది.. `భగవంత్ కేసరి` ట్యాగ్ లైన్. దాన్ని.. పరోక్షంగా బోయపాటి మాటలకు అన్వయించుకొని, కొంతమంది ఫ్యాన్స్... ఆ కోణంలో చూస్తున్నారు. తమన్‌కి బోయపాటి మాటలు చేరే ఉంటాయి. అందుకే తమన్ కూడా అలాంటి రియాక్షన్ ఇచ్చాడంటూ నెటిజన్లు చెప్పుకొంటున్నారు. మరి తదుపరి సినిమాకి బోయపాటి - తమన్ కలుస్తారా? కలిస్తే.. ఇప్పటి ఈ విషయాన్ని మర్చిపోయి మళ్లీ పని చేసుకోగలరా? అనేది పెద్ద ప్రశ్న. లెజెండ్ ఇష్యూ తరవాత బోయపాటి - దేవిశ్రీ కలిసి వర్క్ చేశారు. ఇది కూడా అంతేనేమో..?