పెద్ద సినిమాలొచ్చినప్పుడు... ఏదో ఓ రూపంలో కాపీ ముద్ర పడుతుంటుంది. ఫలానా పాట కాపీ అనో, ఫలానా సీను ఎక్కడి నుంచో లేపేశారనో.. ప్రేక్షకులు పట్టేస్తుంటారు. ఓటీటీల పుణ్యాన, ప్రపంచ సినిమా జ్ఞానమంతా మనకు తెలిసిపోతోంది. దాంతో కాపీ రాయుళ్లు ఈజీగా దొరికేస్తున్నారు. అయితే ఓ సినిమా విడుదల కాకముందే... దానిపై కాపీ ముద్ర పడిపోయింది. అదే.. `ధ్యాంక్యూ బ్రదర్`. అనసూయ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. ఈనెల 7న ఆహాలో నేరుగా విడుదల అవుతోంది.
ఈ సిరిమా నైజీరియన్ ఫిల్మ్ `ఎలివేటర్ బేబీ`కు కాపీ అని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. 2019లో విడుదల అయిన సినిమా ఇది. `థ్యాంక్యూ బ్రదర్` ట్రైలర్.. `ఎలివేటర్ బేబీ` కాన్సెప్ట్ రెండూ అచ్చుగుద్దినట్టు దిగిపోయాయి. ఇది అఫీషియల్ రీమేకా? లేదంటే... ఆ పాయింట్ అక్కడి నుంచి ఎత్తేశారా? అనే గుట్టు మాత్రం చిత్రబృందం విప్పాలి. ఓ గర్భిణీ లిఫ్ట్ లో చిక్కుకుపోతుంది. అక్కడ ఓ అపరిచితుడు కూడా అమెతో ఉంటాడు. ఆ గర్భిణీని ప్రాణాలతో ఎలా కాపాడాడు అన్నదే ఎలివేటర్ బేబీ కాన్సెప్ట్. `థ్యాంక్యూ బ్రదర్` కథ కూడా అదే. మరి అనసూయ ఈ విషయమై ఏమంటుందో?