రాజకీయాలు వేరు - సినిమాలు వేరు. కెమెరా ముందు విశ్వరూపం చూపించే నటులు, రాజకీయాల్లోకి అడుగుపెడితే తడబడతారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. తాజాగా దేశంలో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు చూస్తే... అది మరోసారి నిజమని తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో కాకలు తీరిన స్టార్లు... పరాజయం పాలయ్యారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్థాపించి, తమిళనాట అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన కమల్ హాసన్... ఎం.ఎల్.ఏగా ఓడిపోయారు.
కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై 1300 ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ ఓడిపోయాడు. త్రిస్సూర్ నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.
తమిళనాడులో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఖుష్బూకీ ఓటమి తప్పలేదు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఖుష్బూ తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు.