మొన్న జరిగిన ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ నేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి అయిన జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని 'యాక్టర్' అని సంభోదించారు. అవును నిజమే ఆయన యాక్టరే, ఈ సంగతి అలా గుర్తుపెట్టుకుని పక్కన పెట్టండి. అసలు వివరాల్లోకి వెళితే, 'పెళ్లి చూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉన్నారు కదండీ. ఆయన లేటెస్ట్‌గా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మల్లేశం' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఆయన అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు.
భవిష్యత్ తరాలకు మంచి మంచి విలువలున్న సినిమాలను అందించాలి తప్ప, కమర్షియల్ మూవీ, ఆర్ట్ మూవీ అని వేరు చేసి చూసేలా ఫిలిం మేకర్స్ ఆలోచనలు ఉండకూడదు. మనం తీసే సినిమాలు భావి తరాలను ప్రభావితం చేసేలా ఉండాలి. హీరో, కమెడియన్ అనే ట్యాగ్‌లైన్ పోయి 'యాక్టర్' అనే ఒకే ఒక్క ట్యాగ్‌లైన్ వస్తేనే, సినీ రంగంలో మరెన్నో మంచి విజయాలు అందుకోగలం.. అంటూ ఆయన విన్నవించారు.
దర్శకుడిగా తొలి సినిమాకే డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకుని సింపుల్‌గా ఆ కాన్సెప్ట్‌కి దృశ్యరూపం అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు తరుణ్ భాస్కర్. ఇకపోతే, ప్రస్తుతం మనోడు దర్శకుడి నుండి హీరోగా కూడా డెవలప్ అయ్యాడు. అదిగో.. సార్ ముందే చెప్పారు కదా, హీరో అనే ట్యాగ్‌లైన్ ఉండకూడదు అని. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న డిఫరెంట్ మూవీ అన్న మాట ఇది. దీనికి విజయ్ దేవరకొండ నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు కూడా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.