ఈమధ్య ఫహాద్ ఫాజిల్ పేరు తెలుగులో గట్టిగా వినిపిస్తోంది. ఈ మలయాళం నటుడు నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. అవన్నీ తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఫాజిల్ పెర్‌ఫార్మెన్స్ చూసి సుకుమార్ కూడా ఫిదా అయ్యాడు. తన `పుష్ష`లో విలన్ గా ఎంపిక చేశాడు. ఫాజిల్ మలయాళ నటుడు. మరి తనకు డబ్బింగ్ ఎవరు చెబుతారు? అనుకుంటున్న దశలో తరుణ్ పేరు బయటకు వచ్చింది. ఇటీవల ఫాజిల్ నుంచి వచ్చిన డబ్బింగ్ బొమ్మ `అనుకోని అతిథి`లో ఫాజిల్ పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. తన గొంతు ఫాజిల్ కి అచ్చుగుద్దినట్టు సరిపోయింది. దాంతో `పుష్ష`లోనూ ఫాజిల్ కి తరుణే డబ్బింగ్ చెబుతాడని భావించారు.
తరుణ్ కెరీర్ హీరోగా దాదాపుగా పుల్ స్టాప్ పడిపోయినట్టే. మహా అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయత్నించాలి. అయితే డబ్బింగ్ కళాకారుడిగా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టడానికి `అనుకోని అతిథి` ఓ అవకాశం ఇచ్చింది. దీంతో తరుణ్ కెరీర్ టర్న్ అవుతుందనుకున్నారంతా. అయితే ఇప్పుడు తరుణ్‌కి ఫాజిల్ ఓ ట్విస్టు ఇచ్చాడు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. `పుష్ఫ`లోని తన పాత్ర కోసం ఫాజిల్ కసరత్తు మొదలెట్టేశాడట. ఇందుకోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నాడని సమాచారం. సో.. తరుణ్ స్పీడుకి బ్రేకులు పడినట్టే.