దేశం మొత్తాన్ని కోరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా భయపెడుతోంది. రోజు రోజుకీ కరోనా పాజిటీవ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అలెర్ట్ అయిపోతున్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా.. ప్రభుత్వానికి కరోనా జాగ్రత్తల గురించి ఉద్భోత చేసింది. తక్షణం.. కరోనా కోసం తీసుకుంటున్న చర్యల గురించి చెప్పాలని ఆదేశించింది. స్కూల్స్, కాలేజీలూ మూసేసి, బార్లు, థియేటర్లు తెరవడంలో ఆంతర్యం ఏమిటని అడిగింది. దాంతో ప్రభుత్వం థియేటర్ల విషయంపై పునరాలోచనలో పడినట్టు టాక్.
ప్రస్తుతం 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. దాన్ని 50 శాతానికి తగ్గిస్తారని ప్రచారం జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల దృష్ట్యా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీకి కుదించకపోవొచ్చు గానీ, మరో వారంలో... ఇలాంటి జీవో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో నిర్మాతలు, బయ్యర్లు ఒణికిపోతున్నారు. ఈనెల నుంచి కొత్త సినిమాల హడావుడి మొదలు కానుంది. స్టార్ హీరోల సినిమాలు వరుసకట్టబోతున్నాయి. ఈనేపథ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీ అంటే... సినిమాలు విడుదల కావడం కష్టమే.