'ఓం నమో వెంకటేశాయ' సినిమాతో రేపు అక్కినేని నాగార్జున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వరుడికి ప్రీతిపాత్రమైన భక్తులలో ఒకరైన హథీరామ్‌బాబా పాత్రలో నాగార్జున ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలుసు కదా. నాగార్జునతోపాటుగా ఈ సినిమాలో అనుష్క రూపంలో మరో హైలైట్ ఉంది. అలాగే ప్రగ్యా జైస్వాల్, విమలారామన్ ఇలా చాలా తారాగణం 'ఓం నమో వెంకటేశాయ' సినిమాకి అదనపు గ్లామర్‌ని అందిస్తోంది. 'అన్నమయ్య' తరహాలో కాదు, అంతకు మించిన ఆధ్మాత్మిక అద్భుతంలా ఈ సినిమా ఉంటుందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చెబుతున్నారు. నాగార్జున సైతం ఇదే మాట అంటున్నాడు. హథీరామ్ బాబా జీవిత చరిత్ర గురించి ఎంతో పరిశోధన జరిపి ఈ చిత్రాన్ని తీశారట. ఎన్నో సినిమాలు చేసినా, 'ఓం నమో వెంకటేశాయ' కథతో కనెక్ట్ అయినంతగా ఇంకే కథతోనూ కనెక్ట్ కాలేదని చెప్పాడు నాగార్జున. తన మనసుకు ఎంతగానో నచ్చిన ఈ 'ఓం నమో వెంకటేశాయ' తనలోని ఆధ్మాత్మిక భావనాల్ని వెలికి తీసిందనీ, సినిమా నిర్మాణ సమయంలో ఆ వెంకటేశ్వరస్వామి మీద భక్తి భావం పెరిగిందనీ, సినిమా చూశాక అదే భావన అందరికీ కలుగుతుందని నాగార్జున ఉద్వేగంగా చెప్పడం వింటున్నాం. సినిమా విడుదలయ్యాక ఆ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ వద్దా ఆధ్మాతిక భావం ఉప్పొంగిపోతుందని చెప్పారు. నాగార్జున చెప్పింది నిజమే, థియేటర్లన్నీ దేవాలయాల తరహాలో 'ఓం నమో వెంకటేశాయ' కోసం ముస్తాబయ్యేలా ఉన్నాయి.