'తిప్ప‌రామీసం' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు:  శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి, రవి ప్రకాష్ తదితరులు.
దర్శకత్వం: విజయ్ కృష్ణ ఎల్
నిర్మాతలు: రిజ్వాన్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్: సిడ్ 
విడుదల తేదీ: నవంబర్ 8,  2019

 

రేటింగ్‌: 2/5

 

క‌థ ఉండాలి. ఆ క‌థ‌లో భావోద్వేగాలు  పండాలి. అప్పుడే ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవుతాడు. ఉందా లేదా అనిపించే క‌థ‌, ఇక అందులోనూ భావోద్వేగాల ఊసే లేదంటే  ఆ సినిమా చ‌ప్ప‌గా సాగిన‌ట్టే. త‌ల్లీకొడుకుల క‌థ‌లోనూ భావోద్వేగాలు పండ‌లేదంటే `తిప్ప‌రామీసం`లాంటి సినిమాలే త‌యార‌వుతాయేమో.  క‌థ కంటే కూడా క‌థ‌నంతో మేజిక్ చేసే రోజులు ఎప్పుడో వ‌చ్చాయి. యువ‌త‌రం ఎక్కువ‌గా అదే ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తోంది. ఇటీవ‌ల మ‌రో అడుగు ముందుకేస్తూ హీరోల పాత్ర‌ల్ని ప్ర‌త్యేక‌మైన యాటిట్యూడ్‌తో తీర్చిదిద్దుతున్నారు. దాంతోనే వినోదం పుట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  అయితే `తిప్ప‌రామీసం`లో ఆ ప్ర‌య‌త్నం దారుణంగా బెడిసికొట్టింది.  దాంతో మీసం తిర‌గ‌లేదు. ఇంత‌కీ ఇందులో క‌థేమిటో తెలుసుకుందాం...
 

* క‌థ‌

 

మ‌ణిశంక‌ర్ (శ్రీవిష్ణు) రాత్రి క‌బ్బుల్లో ప‌నిచేసే డీజే. అమ్మంటే అస్స‌లు ప‌డ‌దు. డ‌బ్బు అవ‌స‌ర‌మైతే మాత్రం వ‌చ్చి వేధిస్తుంటాడు.  మ‌త్తుమందుకి బానిస‌న‌య్యాడ‌ని, చికిత్స పేరుతో  చిన్న‌ప్పుడే  ఒంట‌రిగా ఆస్ప‌త్రిలో వ‌దిలేసింద‌ని కోపం. అప్ప‌ట్నుంచి కుటుంబానికి దూరంగా ఉంటాడు. మ‌ద్యం, జూదానికి అల‌వాటు ప‌డిన మ‌ణిశంక‌ర్‌కి రూ: 30 ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి. అంత ఇవ్వ‌లేక‌పోయిన త‌ల్లిపైనే చెక్ బౌన్స్ కేసు వేస్తాడు.  ఆ త‌ర్వాత ఒక హ‌త్య కేసులో నిందితుడిగా జైలుకి వెళతాడు. మ‌రి త‌న కొడుకు ప్ర‌యోజ‌కుడు కావాల‌నుకొన్న ఆ త‌ల్లి కోరిక నెర‌వేరిందో లేదో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

* న‌టీన‌టులు


శ్రీవిష్ణు తొలిసారి ర‌గ్‌డ్ పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. కొన్ని స‌న్నివేశాల్లో ఇత‌నికి ఈ పాత్ర అత‌క‌లేదు అనిపించినా... న‌ట‌న ప‌రంగా మాత్రం మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచాడు.  కానీ ఆయ‌న క‌థ కంటే కూడా త‌న పాత్ర‌నే చూసి ఈ సినిమాని చేశాడేమో అనిపిస్తుంది.  క‌థానాయిక నిక్కీ తంబోలీ అటు అందంప‌రంగా మెప్పించ‌దు, ఇటు అభిన‌యం ప‌రంగానూ ఆక‌ట్టుకోలేదు. అలా వ‌చ్చి వెళ్లిపోతుంటుంది. రోహిణి త‌ల్లి పాత్ర‌లో మెప్పించింది. ఇక మిగిలిన పాత్ర‌ల గురించి చెప్పుకోవ‌ల్సిందేమీ లేదు.


* సాంకేతిక వ‌ర్గం


సాంకేతికంగా సినిమా అంతంత‌మాత్ర‌మే.  సిద్ కెమెరాకి స‌వాళ్లు ఎక్కువ‌య్యాయి. రాత్రివేళల్లో స‌న్నివేశాల్ని ఎక్కువ‌గా చిత్రీక‌రించారు. సంగీతం బాగుంది.  ద‌ర్శ‌కుడు కృష్ణ‌విజ‌య్ క‌థ‌కుడిగా ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది.

 

* విశ్లేష‌ణ‌

 

క‌థ‌లా చెబితే ఇందులో విష‌యం ఉన్న‌ట్టే అనిపిస్తుంది. తెర‌పైన మాత్రం ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కు క‌థ లేకుండా సినిమా ఎందుకు తీశార‌నే ప్ర‌శ్న ప్రేక్ష‌కుడిలో త‌లెత్తుతుంది. నిజానికి ఇందులో త‌ల్లికొడుకుల  నేప‌థ్యంలో ఒక ఆర్ర్ధ‌త‌తో కూడిన క‌థ ఉంది. కానీ దాన్ని  చెప్పాల్సిన విధానంలో చెప్ప‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు.  కేవ‌లం క‌థానాయ‌కుడి యాటిట్యూడ్‌పైనే కాన్సంట్రేట్ చేసిస‌న్నివేశాలు అల్లుకున్న‌ట్టు అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడికి  ఉన్న‌ట్టుండి క‌థ గుర్తుకు రావ‌డంతో దాన్ని హ‌డావుడిగా ప‌తాక స‌న్నివేశాల్లో చూపించేసిన అభిప్రాయం ప్రేక్ష‌కుడిలో క‌లిగితే అది వాళ్ల  త‌ప్పేం కాదు.  ప్ర‌థ‌మార్థం మొత్తం కూడా హీరో చేసే విన్యాసాల‌తోనే సాగుతుంది. 


మందు కొట్ట‌డం, డ్ర‌గ్స్ పీల్చ‌డం, బెట్టింగ్‌లు చేయ‌డం...  దాదాపుగా ఇలాంటి స‌న్నివేశాలే.  హీరోని ఎంత ర‌గ్‌డ్‌గా చూపిస్తే అంత‌గా క‌నెక్ట్ అవుతార‌నుకున్న‌ట్టున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ ఏదో ఒక ద‌శ‌లోనైనా అత‌నిపై ప్రేక్ష‌కుడిలో  జాలి కలిగించాల‌నే విష‌యాన్ని కూడా మ‌రిచిపోయాడు.  పైగా కొన్ని స‌న్నివేశాలు మ‌రీ శ్రుతిమించిన‌ట్టు అనిపిస్తాయి. క‌థానాయ‌కుడు బ‌ట్ట‌లు విప్పేసి రోడ్ల‌పై ప‌రిగెత్త‌డం, డ్ర‌గ్స్‌తీసుకొని హీరోయిన్‌పై అఘాయిత్యానికి పూనుకోవ‌డంలాంటి స‌న్నివేశాలు ఏమాత్రం రుచించ‌వు.  ద్వితీయార్థంలోనైనా క‌థ చెప్పాడా అంటే అదీ లేదు. ప‌తాక స‌న్నివేశాల్లో ఒక మ‌లుపుతో క‌లిపి క‌థ‌ని చెప్పాడు.  ఆ మ‌లుపు కూడా ఊహించుకోవ‌డానికి అనువుగా ఉంటుంది. దాంతో సినిమా క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా కానీ, పాత్ర‌ల ప‌రంగా కానీ ఏ ద‌శ‌లోనూ మెప్పించ‌లేక‌పోయింది. త‌ల్లీకొడుకుల క‌థే అయినా...  ఏ పాత్ర‌తోనూ ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవ్వ‌లేడు. భావోద్వేగాలు లేని డ్రామా ఏమాత్రం ప్రేక్ష‌కుల‌పై ప్ర‌భావం చూపించ‌లేద‌ని మ‌రోమారు నిరూపించిన చిత్ర‌మిది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 

శ్రీ విష్ణు
డైలాగులు 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్


* మైన‌స్ పాయింట్స్

కథ
కథనం
 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: స‌రిగ్గా అతుక్కోని మీసాన్ని  మెలి తిప్పాల‌ని చూస్తే ఫ‌లితం ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అంతే.

- రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS