ఓవర్సీస్ మొనగాడు మహేష్‌బాబు. ఇందులో నో డౌట్. ఇక్కడ నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినా అక్కడ సక్సెస్ లిస్టులో చేరిపోతుంది. వసూళ్ల పరంగా టాప్ ప్లేస్‌లోనే నిలుస్తుంది. అదీ ఓవర్సీస్‌లో మహేష్ బాబు సత్తా. తాజాగా మహేష్ నటించిన 'భరత్ అనే నేను' చిత్రం ఓవర్సీస్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండో వారం గడుస్తున్నా, బాక్సాఫీస్ వసూళ్ల జోరులో ఏమాత్రం దూకుడు తగ్గలేదు.
అమెరికాలో 'భరత్ అనే నేను' చిత్రం 2.89 మిలియన్ డాలర్లు సాధించినట్లుగా లేటెస్ట్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిత్రం 'రంగస్థలం' యూఎస్ బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్లతో పోల్చితే ఈ లెక్క తక్కువే. ఎందుకంటే 'రంగస్థలం' 3.5 మిలియన్స్ దాటేసింది అక్కడ. అయితే ఈ కౌంట్‌కి ఇంకెంతో దూరంలో లేదు 'భరత్'.
ఇంతవరకూ ఓవర్సీస్ మార్కెట్ లేని చరణ్‌కి 'రంగస్థలం'తో ఈ స్థాయిలో వసూళ్లు దక్కినప్పటికీ, ఓవర్సీస్ మొనగాడు అయిన మహేష్‌బాబు ఆ లెక్కల్ని అందుకోవడానికి మరికొంత టైమ్ పట్టేలానే కనిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్'కి సినీ ప్రముఖుల నుండే కాక, రాజకీయ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. కేటీఆర్ ఈ సినిమా చూసి, చాలా చాలా ఇన్‌స్పైర్ అయ్యారట. అందుకే తన అనుభవాలను పంచుకునేందుకు చిత్ర యూనిట్‌తో కలిసి ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనడం ఈ సినిమా సాధించిన మరో ప్రత్యేకమైన సక్సెస్‌గా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది.