కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎక్కడి వ్యవస్థలు అక్కడ ఆగిపోయాయి. పారిశ్రామిక రంగం కుదేలైంది. ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆకలి కేకలు మొదలయ్యాయి. ఆ ప్రభావం చిత్రసీమపైనా పడింది. షూటింగులు, సినిమా విడుదలకు బ్రేక్ పడింది. దీని వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టం. కానీ.. ఈ నష్టం టాలీవుడ్ లో సుమారు 400 కోట్ల వరకూ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమా వ్యాపారం ఎక్కువగా రొటేషన్ పద్ధతిలోనే జరుగుతుంటుంది. నెల రోజుల పాటు సినిమాకి సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోయాయంటే ఆ రొటేషన్‌లో చలామణీ అయ్యే వందల కోట్ల రూపాయలకు బ్రేక్ పడిపోయినట్టే. థియేటర్లకు తాళాలు వేయడంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు నష్టపోయారు. ఇక షూటింగ్ అంటే సెట్లో 100 నుంచి 150 మంది ఉండాల్సిందే. వాళ్లందరి జీవన భృతి పోయినట్టే. విడుదలకు రెడీ అయి, రిలీజ్ డేట్ కూడాప్రకటించుకున్న దాదాపు 10 - 15 సినిమాలు ఇప్పుడు లాక్ డౌన్ వల్ల ఆగిపోయాయి. సినిమా అంటే కోట్ల రూపాయల బిజినెస్. అప్పులు, వడ్డీల లెక్కలు. ఎన్ని రోజులు సినిమా విడుదల కాకుండా ఆగితే.. అంత వడ్డీ పెరుగుతుంది. ఆ నష్టాన్ని నిర్మాతలు భరించాల్సివస్తోంది. విడుదలకు రెడీగా ఉన్న సినిమాలే కాదు. సెట్స్‌పై ఉన్న సినిమాలూ నష్టపోతున్నాయి. సినిమా కోసం ఫైనాన్స్ తీసుకుని, షూటింగ్ మొదలెట్టి, మధ్యలో ఆగిపోయిన సినిమాలకు లెక్కే లేదు. ఆ వడ్డీని భరించాల్సింది కూడా నిర్మాతలే.
వి, ఉప్పెన, అరణ్య, నిశ్శబ్దం.. ఇలా విడుదలకు రెడీ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ.. ఈ ప్రాజెక్టులన్నీ స్టేల్ అయిపోతుంటాయి. వాటిని ఓటీటీలో విడుదల చేసుకుంటే అదో నష్టం. థియేటర్ల అద్దెలు, కరెంటు బిల్లులు, సిబ్బంది జీత భత్యాలు ఇవన్నీ భరించుకోవడం మరో పెద్ద సమస్య. ఇవన్నీ తడిచి మోపెడు అవుతోంది. దమ్మీడి ఆదాయం లేదు.కనిపిస్తోందల్లా ఖర్చే. రేపు లాక్ డౌన్ ఎత్తేసినా, షూటింగులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు. మరి ఈ నష్టాన్ని టాలీవుడ్ ఎప్పుడు భర్తీ చేసుకుంటుందో?