కరోనా విపత్తుపై పోరాటం చేయడానికి టాలీవుడ్ ముందుకొచ్చింది. పవన్, ప్రభాస్, మహేష్, బన్నీ... ఇలా హీరోలంతా భారీగా విరాళాలు ప్రకటించారు. యువ హీరోలూ తమ స్థోమతకు తగ్గట్టుగా స్పందిస్తున్నారు. దాదాపుగా హీరోలంతా ఏదో ఓ రూపంలో తమ సహాయం ప్రకటించేశారు. కానీ హీరోయిన్ల నుంచి ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. టాలీవుడ్ ద్వారా లక్షలు, కోట్లు సంపాదించుకున్న హీరోయిన్లు, `మా పుట్టిల్లు హైదరాబాదే` అని గర్వంగా చెప్పుకునే కథానాయికలు ఎవ్వరూ ఇప్పటి వరకూ కరోనాపై పోరుకు తమవంతు వితరణ ప్రకటించలేదు.
సమంత, తమన్నా, అనుష్క, కాజల్... వీళ్లంతా సినిమాకి కోటికి తగ్గకుండా పారితోషికం తీసుకుంటారు. ఇక షాపింగ్‌మాల్స్‌లో సందడి చేయడానికి సెపరేటు రేటు. ఎలాకాదన్నా యేడాదికి కనీసం 10 కోట్ల వరకూ ఆదాయాన్ని సంపాదించుకోగల దిట్టలు. వీళ్లెవ్వరూ ఇప్పటి వరకూ వితరణ ప్రకటించలేదు. వీళ్లకు కనీస సామాన్య బాధ్యత లేదా? హీరోలతో పాటు పోటీగా పారితోషికం అందుకోవడంలోనూ, వాళ్లతో పాటు సమానంగా క్రేజ్ తెచ్చుకునే విషయంలోనూ పోటీ పడతుతంటారు. ఇప్పుడు మాత్రం ఆ పోటీ మర్చిపోయారా? ప్రణీత ఒక్కర్తే ముందుకొచ్చి తన వంతుగా లక్ష రూపాయలు ప్రకటించింది. తన చేతిలో సినిమాల్లేవు. ఆమెని ఎవ్వరూ పట్టించుకోలేదు కూడా. ఆమెకున్న బాధ్యత... మిగిలినవాళ్లకు ఎందుకు లేనట్టో..??