రాజమౌళి సినిమా అంటే.. ఎక్కడో ఓ చోట - `కాపీ` నింద మోయాల్సిందే. ఫలానా సీను ఆ హాలీవుడ్ సినిమాకి కాపీ, ఫలానా ఎపిసోడ్ ఈ హాలీవుడ్ ఎపిసోడ్ నుంచి ఎత్తేశారు.. అని వేలెత్తి చూపించడానికి అంతా సిద్ధంగా ఉంటారు. సింహాద్రి నుంచి మొన్నటి బాహుబలి వరకూ ఏ సినిమా ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్`పై కూడా కాపీ ముద్ర పడిపోయింది. ఆర్.ఆర్.ఆర్.. మోషన్ పోస్టర్ ఈ ఉగాదికి విడుదలైంది. సినిమా కాన్సెప్ట్ ని ఒక్క మోషన్ పోస్టర్‌లో చక్కగా చెప్పాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ క్యారెక్టర్లేమిటన్న విషయంలో ఈ మోషన్ పోస్టర్‌తో ఓ స్పష్టత ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు ఇదే కాపీ మరక మోయాల్సివస్తోంది.
హాలీవుడ్ మూవీ ఫైర్ అండ్ ఐస్ కాన్సెప్ట్‌కి ఇది దగ్గరగా ఉందని, సినిమా కూడా అందులోంచి ఓ పాయింట్ తీసుకుని ఎత్తేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి ఎప్పుడూ తేలిగ్గా లొంగడు. పాయింట్ ఎక్కడిదైనా తనదైన శైలిలో మార్పులు చేర్పులూ చేసి మాతృక కంటే మిన్నగా రూపొందించగలడు. ఆర్.ఆర్.ఆర్.. విషయంలోనూ అదే జరుగుతుందని రాజమౌళి అభిమానుల ఆశ.