కరోనా నేపథ్యంలో కొందరు హీరోయిన్లూ విలవిల్లాడిపోయారు.. సినిమాల్లేక తల్లడిల్లిపోయారు. ఎలాగోలా సోషల్ మీడియా ద్వారా తమ ఉనికిని చాటుకున్నారు. మళ్ళీ సినిమాల జోరు షురూ అయ్యాక, అందాల భామల పంట పండుతోంది. ఎడా పెడా సినిమా ప్రారంభోత్సవాలు జరుగుతుండడంతో, ఇదివరకు ఫామ్‌లో లేని హీరోయిన్లూ ఇప్పుడు మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు.
అయితే, కరోనా భయం ఇంకా తొలగిపోలేదు. ఎప్పుడు ఏ హీరోయిన్ కరోనా బారిన పడుతుందో తెలియక మళ్ళీ సినీ పరిశ్రమలో టెన్షన్ మొదలైంది. ఇదిలా వుంటే, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించడం చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది. లక్షలకు లక్షలు పోసి మరీ, హీరోయిన్లను ఆయా స్టేజిలపైకెక్కించి డాన్సులు చేయిస్తుంటారు నిర్వాహకులు. కానీ, ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు చాలా చోట్ల 'నో' చెప్పేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. దాంతో, చాలామందికి ఈవెంట్లు రద్దయ్యాయట.
ముందస్తు ఒప్పందాలు కొందరికి జరగ్గా, అడ్వాన్స్‌లు రిటర్న్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కొందరు హీరోయిన్లకు వస్తోందని సమాచారం. టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ ఈ విషయమై నిర్వాహకులతో గొడవ పడుతోందట. ఇదిలా వుంటే, హైద్రాబాద్, బెంగళూరుల్లో ఈవెంట్లకు అవకాశం లేకపోవడంతో, పొరుగు రాష్ట్రాలకి ఎక్కువగా ఈవెంట్లు తరలి వెళుతున్నాయి. అక్కడా చివరి నిమిషంలో ఈవెంట్లు రద్దయితే ఏంటి పరిస్థితి.?