టాలీవుడ్ లో శుక్రవారం వస్తే సినిమా పండగ ఉంటుంది. ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి 'కోర్టు'. రెండు 'దిల్ రుబా'. ఈ రెండిటిలో కోర్టు మూవీకి విశేష ఆదరణ లభిస్తోంది. నాని నిర్మాణంలో తెరకెక్కిన 'కోర్టు' లో కథ, కథనంతో పాటు శివాజీ నటన కూడా ఈ మూవీకి ప్లస్ అయ్యింది. కోర్టు మూవీలో మంగపతిగా నటించిన శివాజీ నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుత నటన కనపరిచాడు. సినిమా మొత్తం శివాజీ క్యారక్టర్ వైపే టర్న్ అయిపోయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన శివాజీ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
సహాయక పాత్రల్లో నటిస్తూనే తన టాలెంట్ తో హీరోగా మారాడు. హీరోగా మెప్పిస్తున్న టైంలోనే సడెన్ గా కనుమరుగైపోయాడు. తరువాత రాజకీయాల్లో శివాజీ పేరు గట్టిగా వినిపించింది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవలేదు. కొన్నాళ్ళు పూర్తిగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ, అనూహ్యంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రయిజ్ చేసారు. ఫెవరెట్ కంటెస్టెంట్ గా బరిలో దిగిన శివాజీ చివరి వరకు ఉన్నాడు. బిగ్ బాస్ క్రేజ్ తో బయటికి రాగానే #90 స్ మిడిల్ క్లాస్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్ కి మంచి ఆదరణ లభించటంతో శివాజీకి మరిన్ని ఛాన్స్ లు వచ్చాయి.
ఇలా వచ్చిన ఆఫరే కోర్టు లో మంగపతి పాత్ర. ఈ రోల్ లో శివాజీని తప్ప వేరెవర్నీ ఊహించలేనంతగా ఆ క్యారక్టర్ పండింది. విలన్ అంటే రక్తం చిందించక్కర్లేదు, హావా భావాలు చాలని నిరూపించాడు శివాజీ. #90 స్ మిడిల్ క్లాస్ లో ఎంత సాఫ్ట్ గా కామ్ గా ఉంటుందో శివాజీ క్యారక్టర్ కోర్టు మూవీలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది మంగపతి పాత్ర. ఈ సినిమాతో శివాజీ నట విశ్వరూపాన్ని చూసిన దర్శకులు టాలీవుడ్ కి కొత్త విలన్ దొరికాడని మురిసిపోతున్నారట.