సంక్రాంతి సినిమాలొచ్చేశాయ్.. సంక్రాంతి కంటే ముందే, సినీ పరిశ్రమకు పండగొచ్చేసింది 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో. అసలు సంక్రాంతి మాత్రం 'క్రాక్' సినిమాతో మొదలయ్యింది.. 'అల్లుడు అదుర్స్', 'రెడ్' సినిమాలతో పండగకి ఫుల్ జోష్ వచ్చేసింది. టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలు ప్రేక్షకుల మన్నన పొందుతుండడం ఆహ్వానించదగ్గ విషయమే. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవాల్సి రావడం తెలుగు సినిమా పరిశ్రమకి కష్టమే అయినా, అస్సలేమీ లేకుండా పోవడం కంటే.. ఎంతో కొంత వుండడం చాలా చాలా బెటర్ కదా.! ఎలాగైతేనేం, సినీ సంక్రాంతి అదిరిగింది.
తదుపరి పరిస్థితి ఏంటి.? వరుసగా సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. ఈ నెలాఖరున విడుదలయ్యే సినిమాలు, ఫిబ్రవరిలో విడుదల కానున్న సినిమాలకు సంబంధించి అనౌన్స్‌మెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంకోపక్క, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.. ఎగ్జిబిటర్లదీ అదే పరిస్థితి. నిర్మాతలకీ కొత్త కష్టాలొస్తున్నాయి. ఓ డిస్ట్రిబ్యూటర్ తనకు మంచి థియేటర్లు దొరకలేదని వాపోవడం చూశాం. అసలే పరిస్థితి అంతంతమాత్రంగా వుంది. ఇలాంటి తరుణంలో వివాదాలు సినీ పరిశ్రమకు అస్సలు మంచివి కావు. పెద్దలు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాలి. అదే సమయంలో, ఎక్కువ సినిమాలు ఒకేసారి విడుదల కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా సినీ పెద్దలదే. లేకపోతే, ఒక సినిమాని ఇంకో సినిమా చంపేసే ప్రమాదం ముంచుకు రావొచ్చు.