విజయ్ హీరోగా నటించే సినిమాలకు విడుదలకు ముందు క్రియేట్ అయ్యే హైప్ ఓ రేంజ్‌లో వుంటుంది. చాలాసార్లు ఆయన నటించిన సినిమాలకు నెగెటివ్ రివ్యూలు వస్తుంటాయి. కానీ, వాటిని ఎప్పుడూ ఖాతరు చేయడు విజయ్. సక్సెస్ వస్తే పొంగిపోడు, ఫెయిల్యూర్ వస్తే కుంగిపోడు. గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలకు వసూళ్ళు వచ్చిపడుతోంటే, విజయ్ ఎందుకు ఆందోళన చెందాలి.? ఇప్పుడు 'మాస్టర్' విషయంలోనూ అదే జరుగుతోంది.
సినిమాకి తొలి రోజు టాక్ చాలా బ్యాడ్‌గా వచ్చింది. ఆ మాటకొస్తే, సినిమా విడుదలకు ముందే లీక్ అవడంతో నిర్మాతలకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. ఆ టెన్షన్‌కి సినిమా రిజల్ట్ మరింత టెన్షన్‌ని జోడించింది. కానీ, వసూళ్ళు మాత్రం రికార్డు స్థాయిలో వచ్చి పడుతున్నాయట. తెలుగులో 'మాస్టర్'కి తొలి రోజే షాక్ తగిలినా, తమిళనాడులో మాత్రం థియేటర్లు పోటెత్తేస్తున్నాయి. 'ఇదీ విజయ్ స్టామినా..' అంటూ విజయ్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. బ్యాడ్ టాక్ వస్తేనే వసూళ్ళు ఇలా వున్నాయ్, హిట్ టాక్ వస్తే.. ఇంకేమన్నా వుందా.? అంటూ తమిళ సినీ ట్రేడ్ పండితులూ ఆశ్చర్యపోతున్నారు.
ఇలా తమిళ సినీ ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడం విజయ్‌కి కొత్త కాదు. ఈ మధ్య ప్రతి సినిమాతోనూ ఇలాంటి స్వీట్ షాకులే ఇస్తున్నాడు విజయ్. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. సబ్జెక్ట్స్ ఎంపిక విషయంలో ఇకనైనా విజయ్ జాగ్రత్త పడతాడేమో చూడాలిక.